నేచురల్ స్టార్ నాని హిట్ 3 చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇటీవల కాలంలో ఏపీలో కూటమి ప్రభుత్వం స్టార్ హీరోల చిత్రాలన్నింటికీ టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నిర్మాతలు అప్లై చేసుకున్న వెంటనే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ జీవో విడుదల చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని హిట్ 3 చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 ది థర్డ్ కేస్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ అనేది ఒక ప్రాంఛైజీగా దర్శకుడు శైలేష్ కొనసాగిస్తున్నారు. ట్రైలర్ లో నాని నెవర్ బిఫోర్ అనిపించే విధంగా మోస్ట్ వయలెంట్ గా కనిపిస్తున్నారు. మే 1న అంటే మరికొన్ని గంటల్లో హిట్ 3 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి పెంచిన టికెట్ ధరల్ని పరిశీలిద్దాం. 

సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు పెంచుకునేలా, మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు పెంచుకునేలా ప్రభుత్వం వీలు కల్పించింది. అంటే సింగిల్ స్క్రీన్స్ లో హిట్ 3 టికెట్ ధర 200, మల్టీప్లెక్స్ లలో 250 రూపాయలుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పెంచిన టికెట్ ధరలు మొదటి వారం వరకు మాత్రమే అమలులో ఉంటాయి అని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత సాధారణ ధరలు అమలులోకి వస్తాయి. 

మొదటి వారంలో భారీ వసూళ్లు రాబట్టుకోవడానికి పెంచిన టికెట్ ధరలు ఉపయోగపడతాయి. అయితే చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తేనే పెంచిన టికెట్ ధరలు ప్లస్ అవుతాయి. ఒక వేళ టాక్ తేడా కొడితే అదే శాపంగా కూడా మారవచ్చు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో నానికి జోడిగా కెజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి హాజరైన సంగతి తెలిసిందే. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రశాంతి నిర్మించారు.