ఇటీవల `దసరా` చిత్రంతో పెద్ద హిట్‌ అందుకున్న నాని.. ఈ ఏడాది మరో రెండు సినిమాలతో అలరించబోతున్నారు. సీనియర్‌ హీరో చిత్రంలో ఆయన కనిపించబోతున్నారు.  

నేచురల్‌ స్టార్‌ నాని ఇటీవల `దసరా`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్‌ రస్టిక్‌గా రూపొందిన ఈ చిత్రం ఇక్కడ పెద్ద విజయం సాధించింది. 110కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. థియేట్రికల్‌గా సినిమా బ్రేక్‌ ఈవెన్‌ మాత్రమే అయ్యింది. డిజిటల్‌ పరంగా నిర్మాతలు లాభాల్లో ఉన్నారు. ఆ రకంగా ఇది ప్రాఫిటబుల్‌ ప్రాజెక్ట్ గా నిలిచింది. అయితే నిర్మాతలు ఆశించిన స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లని సాధించలేకపోయింది. నైజాం, ఓవర్సీస్‌లోనే ఈ సినిమా భారీగా వసూళ్లు చేసింది. 

ఇక ప్రస్తుతం నాని తన `నాని30` చిత్రంలో నటిస్తున్నారు. శౌర్యవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కుర్రాడికి తండ్రిగా నాని నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ లెక్కన ఈ ఏడాది రెండు సినిమాలతో మెప్పించబోతున్నారు నాని. ఇదే కాదు, మరో సినిమాతో ఆయన ఈ ఏడాది సందడి చేయబోతున్నారట. అది కూడా ఒకేసారి.. అంటే `నాని30` చిత్రంతో పాటు విడుదల కాబోతుండటం విశేషం. మరి ఆ విశేషాలు చూస్తే.. 

నాని.. ఓ సీనియర్‌ హీరో సినిమాలో కనిపించబోతున్నారు. ఆయన ఎవరో కాదు వెంకటేష్‌ మూవీ. `హిట్‌2` సినిమాని రూపొందించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేష్‌ `సైంధవ్‌` చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని భారీ యాక్షన్‌ మూవీగా రూపొందిస్తున్నారు శైలేష్‌. ఈ సినిమాని కూడా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 

అయితే ఈ సినిమాలో నాని గెస్ట్ రోల్‌ చేస్తున్నారట. `సైంధవ్‌` చిత్రంలో నాని అతిథి పాత్రలో కాసేపు కనిపిస్తారట. నాని హీరోగా శైలేష్‌ `హిట్‌3` సినిమాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ మూవీ తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో ఆయన `అర్జున్‌ సర్కార్‌`గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే `హిట్‌2`లో ప్రకటించారు. ఇదే పాత్రలో `సైంధవ్‌` చిత్రంలో కనిపించనున్నారట. శైలేష్‌ యూనివర్స్ లో భాగంగానే `సైంధవ్‌` సినిమాని రూపొందిస్తున్నారని, `హిట్‌` చిత్రాలకు దీనికి లింక్‌ ఉంటుందని తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు క్రేజీగా, ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.