ప్రముఖ సీనియర్ హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి చాలా సార్లు మాట్లాడారు. ఒకానొక సమయంలో 2017లో మోక్షజ్ఞ అరంగేట్రం ఖయామని అన్నారు.

కానీ ఇప్పుడు 2019 కూడా అయిపోతుంది. ఇప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పష్టత రాలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుండడంతో అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదనే ప్రచారం కూడా ఊపందుకుంది.  కానీ ఈ ప్రచారం నిజం కాదని.. కొత్త ఏడాదిలో కచ్చితంగా ఈ నందమూరి కుర్రాడుహీరో అవుతాడని బాలయ్య సన్నిహితుల సమాచారం.

దీనికి సంబంధించిన సంకేతాలు కూడా అందుతున్నాయి. మోక్షజ్ఞ ఈ నెల 6న 25వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ తోపాటు ఆంధ్రాలో పలు జిల్లాల్లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి నందమూరి అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.

ఇంతకముందు మోక్షజ్ఞ పుట్టినరోజు అంటే ఎలాంటి హడావిడి ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం భారీ వేడుకలు జరపాలని బాలయ్య కుటుంబం నుండి ఆదేశాలు వచ్చాయట. వచ్చే ఏడాది హీరోగా మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమని అందుకే ఈ హంగామా అని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి!