Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్‌ ఘాట్‌ని నందమూరి ఫ్యామిలీ సందర్శించడం లేదుః తనయుడు రామకృష్ణ వెల్లడి

ఈ సారి కరోనా విలయతాండవం దృష్ట్యా, అభిమానుల క్షేమం ముఖ్యమని భావించి ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శించడం లేదని ఎన్టీఆర్‌ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ తెలిపారు.

nandamuri family no visit ntr ghat due to corona said ramakrishna  arj
Author
Hyderabad, First Published May 28, 2021, 7:36 AM IST

నట సార్వభౌముడు ఎన్టీఆర్‌(నందమూరి తారక రామారావు) 98వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్‌ బండ్‌ వద్దగల ఎన్టీఆర్‌ ఘాట్‌కి వెళ్లి నివాళ్లు అర్పించడం ఆనవాయితీ. జూ.ఎన్టీఆర్‌, బాలకృష్ణ, కళ్యాణ్‌ రామ్‌, అలాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ సైతం ఎన్టీఆర్‌ ఘాట్‌కి వెళ్లి నివాళ్లు అర్పిస్తుంటారు. జయంతి, వర్థంతి సందర్భంగా వాళ్లు ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శిస్తారు. కానీ ఈ సారి కరోనా విలయతాండవం దృష్ట్యా, అభిమానుల క్షేమం ముఖ్యమని భావించి ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శించడం లేదని ఎన్టీఆర్‌ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ తెలిపారు.

`ఈ రోజు నాన్నగారి 98వ జయంతి. ప్రతిసారీ ఆయన ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. అయితే ఈసారి కరోనా తీవ్రత వల్ల వెళ్లలేకపోతున్నాం. ఇది ఆయన అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా, ధైర్యంగా ఉండండి. ఇక నాన్నగారి గురించి మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడినా తనివితీరదు. ఆయన గురించి రెండు మాటల్లో చెప్పాలంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ. నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు అనే మాటను ఆయన నిజం చేశారు. 

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు కానీ.. వారి రూపాల్లో మనందరినీ అలరించి మనకు దేవుడయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారు. యవత్ తెలుగు ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారిదే. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత ఆయనదే. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఆయనే. ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే. ఆ యుగపురుషుడిని అందరూ ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలని నందమూరి అభిమానులకు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తున్నా. జోహార్ ఎన్టీయార్, జై తెలుగు తల్లి, జోహార్ హరికృష్ణ` అని నందమూరి రామకృష్ణ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios