అసత్య ప్రచారం చేస్తున్నారు.. : నర్సులపై చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ వివరణ
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులను కించపరిచారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తన వ్యాక్యలపై వివరణ ఇచ్చారు.

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులను కించపరిచారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు జనసేన అధినేత పవన్ కల్యాన్ గెస్ట్‌గా వచ్చారు. అయితే ఎపిసోడ్‌లో బాలకృష్ణ తమను అవమానించేలా మాట్లాడారని కొందరు నర్సులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తన వ్యాక్యలపై వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.
ఇక, ఇటీవలి కాలంలో బాలకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ 'దేవ బ్రాహ్మణుల గురువు దేవర మహర్షి. వారి నాయకుడు రావణాసురుడు' అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. అది జరిగిన కొద్ది రోజులకే.. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో 'అక్కినేని తొక్కినేని' అంటూ బాలకృష్ణ మాట్లాడటం వివాదానికి దారితీసింది. ఏఎన్నార్‌ని అవమానించిన బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. ఏఎన్నార్‌ను అవమాన పరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.