Balakrishna : విగ్గుపై బాలయ్య ఓపెన్ కామెంట్స్.. మూస డైరెక్టర్లకు చురకలు.. ఓ సర్ ప్రైజింగ్ అప్డేట్..
‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ లో బాలయ్య స్పీచ్ ఆసక్తికరంగా మారింది. ఆయన విగ్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. అలాగే ప్రస్తుత డైరెక్టర్లపైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీలా కూతురు పాత్రలో అలరించబోతోంది. అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషించారు. థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న మరో నాలుగు రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో బాలయ్య మాటలు ఆసక్తికరంగా మారాయి.
అనిల్ రావిపూడి నా అభిమాని. మొదటి నుంచి ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ చూస్తూ ఉన్నాను. మొదట మా అన్నయ్యగారి అబ్బాయి కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’ సినిమా చేశాడు. అందులో నా సాంగ్ రీమిక్స్ పెట్టారు. అప్పటి నుంచి ఆయన సినిమాలన్నీ విభిన్నంగా ఉంటున్నాయి. సినిమా సినిమాకు పోలిక లేకుండా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఓకే జానర్ సినిమాలు, ఓకే హీరోతో సినిమాలు చేసే దర్శకులను చూశాను. నాకో కథ అవసరమైతే వేరే హీరోకు సరిపడే కథను తీసుకొస్తున్నారు.
అలా కాకుండా రకరకాల హీరోలతో, రకరకాల సబ్జెక్ట్స్ తో సినిమాలు చేయాలి. అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘ఎఫ్3’ సినిమాలు చేయడం విశేషం. నేనూ ఆయన్ని చూసి స్ఫూర్తి పొందాను. ఇక హాలీవుడ్ డైరెక్టర్లు సైతం విభిన్న సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి, నేను ‘భగవంత్ కేసరి’ని ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఈ సినిమా కూడా విభిన్న కథగా ఉండబోతోందంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమా చేసిన అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి ఓ వరమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా బాలయ్య కామెంట్స్ ప్రస్తుతం ఉన్న మూస డైరెక్టర్లకు చురకలుగా అంటించినట్లైయింది.
అలాగే.. ఏ చిత్రమైనా సక్సెస్ అవ్వాలంటే.. డైరెక్టర్, కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్ ప్రధానం. కెమెరా విషయంలో రామ్ ప్రసాద్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు. నా ప్రతి కదలిక ఆయనకి తెలుసు. అప్పట్లో క్యారవాన్లు లేవు. చెట్ల కింద చాప, దిండు వేసుకొని విగ్గు తీసుకుని పడుకొనే వాళ్లం. ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. అయితే రీసెంట్ గా ఎవడో వెదవ ఆయన విగ్గు పెట్టుకుంటాడా? అని అన్నాడు నన్ను. అవును నేను విగ్గు పెట్టుకుంటాను నీవ్వెందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగాను. మనదంతా ఓపెన్ బుక్. ఎవ్వడికీ భయపడే పనిలేదు.... అంటూ వ్యాఖ్యానించారు. ఏదేమైనా బాలయ్య స్పీచ్ తో ఇటు సినిమాపై హైప్ పెంచేశారు. అలాగే ప్రతి టెక్నీషియన్, డైరెక్టర్, నటీనటుల పనితీరును ప్రశంసించారు. అలాగే ఈ చిత్రంలో ఇప్పటి వరకు రివీల్ అయిన పాత్రలే కాకుండా మరో సర్ ప్రైజింగ్ రోల్ కూడా ఉందని, అది థియేటర్ లోనే అభిమానులకు చూపించబోతున్నట్టు తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను దాచి ఉంచామని సినిమాపై ఆసక్తిని పెంచారు.