సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి హైదరాబాద్ కి వస్తున్న దారిలో అన్నేపర్తి దగ్గర డివైడర్ ని ఢీకొట్టిన కారులో నుండి బయటకి పడిపోయిన హరికృష్ణ తలకి తీవ్ర గాయం కావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్సకి ఆయన శరీరం సహకరిచకపోవడంతో కన్నుమూశారు. దివంగత నందమూరి తారక రామారావు తనయుడిగా సినిమాలతో పాటు, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు హరికృష్ణ. 
 

1967లో 'శ్రీకృష్ణావతారం' చిత్రంలో చిన్నికృష్ణుడిగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 'శ్రీరాములయ్య','సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సినిమాలతో నటుడిగా ఆయనకు చక్కటి గుర్తింపు లభించింది.ఆయన నటించిన సీతయ్య సినిమాలో 'ఎవరి మాటా వినడు సీతయ్య' అనే డైలాగ్ ఇప్పటికీ కొన్ని సినిమాల్లో వినిపిస్తూనే ఉంది. హీరో అంటే ఫక్తు కమర్షియల్ సినిమాల బాట పట్టకుండా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఓ సందేశాన్ని చెప్పాలనుకునే నటుడు హరికృష్ణ.

'స్వామీ' సినిమాలో చెళ్లెళ్లకి జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగే అన్న పాత్రలో ఆయన్ని తప్ప మరెవరినీ ఊహించలేమ్. ఆయన చివరిగా నటించిన సినిమా 'శ్రావణమాసం'. ఈ మధ్యకాలంలో తన ఇద్దరు కొడుకులు కల్యాణ్ రామ్, ఎన్‌టి‌ఆర్ లు నటించే సినిమాల్లో ఆయన కనిపించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ ఆయన మాత్రం 13 ఏళ్లుగా నటనకు దూరంగా ఉంటూ రాజకీయాలకే పూర్తిగా అంకితమయ్యారు. 

అప్పుడప్పుడు తన కొడుకుల సినిమాల ఫంక్షన్స్ కి హాజరవుతూ అభిమానుల్లో జోష్ నింపేవారు. నిర్మాతగా కూడా ఆయన పని చేశారు. ఆయన నటించిన 'దానవీర శూర కర్ణ' సినిమాను ఆయనే నిర్మించడం విశేషం.   ఇప్పుడు ఆయన మరణం కుటుంబ సభ్యులను, నందమూరి అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది!