యంగ్‌ హీరో నాగశౌర్య మరో సాహసం చేస్తున్నాడు. సక్సెస్‌ కోసం సొంత బ్యానర్‌లో మరో సినమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా, రాజేంద్ర డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. తాజాగా కొత్త సినిమాని ప్రారంభించుకున్నాడు. `అలాఎలా` ఫేమ్‌ అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. 

అయితే ఈ సినిమాని తన సొంత బ్యానర్‌లో నిర్మించబోతుండటం విశేషం. ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య మదర్‌ ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. తాజాగా బుధవారం ఈ సినిమా ప్రారంభమైంది. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ క్లాప్‌ కొట్టి సినిమాని ప్రారంభించగా, హీరో నారా రోహిత్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్ అందించారు. మాజీ మంత్రి పి.మహేందర్‌రెడ్డి గెస్ట్ గా అటెండ్‌ అయ్యారు. డిసెంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపబోతున్నారు. 

ఇదిలా ఉంటే నాగశౌర్యని హీరోగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఐరాక్రియేషన్స్ ని ప్రారంభించిన శౌర్య తల్లిదండ్రులు ఉషా ముల్పూరి, శంకర్‌ప్రసాద్‌ తొలి ప్రయత్నంగా `ఛలో` సినిమాతో మంచి  విజయాన్ని అందించి ఫెయిల్యూర్‌లో ఉన్న శౌర్యని మళ్ళీ ఫామ్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత చేసిన `నర్తనశాల` డిజాస్టర్‌ కాగా, ఈ ఏడాది చేసిన `అశ్వథ్థామ` యావరేజ్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి సాహసం చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా శౌర్యకి మంచి హిట్‌ సాధించి తిరుగులేని హీరోగా నిలబడతాడేమో చూడాలి.