యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'నర్తనశాల' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు కొత్తగా స్టార్లు రారు. రామ్ చరణ్ తోనే అది ఆగిపోయింది' అని అన్నాడు. మరి విజయ్ దేవరకొండ ని స్టార్ అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. 'మరి ఫ్లాప్స్ వచ్చినప్పుడు కూడా అలా అనాలి.. అలా స్టార్ అయితే మంచిదే కదా' అని అన్నాడు.

దీంతో శౌర్య.. విజయ్ పై నెగెటివ్ కామెంట్స్ చేశాడనే అభిప్రాయాలను వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగశౌర్య. ''స్టార్ ఇమేజ్ అంటే ఒక్క సినిమాతో ఒక్క రోజులో రాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే స్టార్ ఇమేజ్ అంటే ఎన్టీఆర్, మెగాస్టార్ లాంటి వారిని చూస్తే వారు ఆ ఇమేజ్ అందుకోవడానికి ముప్పై ఏళ్లు పట్టింది. మనం ఒకట్రెండు సినిమాలు చేసి సూపర్ స్టార్స్ అనుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్.

ఉదాహరణకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా.. రూ.80 కోట్లు వసూలు చేస్తుంది. ఇమేజ్ అంటే అది. అంతే తప్ప ఎవరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు'' అంటూ స్పష్టం చేశారు.