అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న సాయిపల్లవితో తెలుగు హీరోలకు సరిపడనట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే ఆమెతో హీరో నానికీ విభేదాలు తలెత్తాయనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. కానీ ఆ తర్వాత నాని అలాంటిదేమీ లేదని బహిరంగంగానే చెప్పేశాడు. కానీ తాజాగా సాయిపల్లవి ప్రవర్తనపై యువ హీరో నాగశౌర్య బహిరంగంగా మీడియాలో కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. 

ఫిదా, ఎంసీఏ చిత్రాల విజయంతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నారు సాయిపల్లవి. నాగశౌర్యతో కలిసి తమిళంలో కరు (తెలుగులో కణం) చిత్రంలో సాయిపల్లవి నటించింది. అబార్షన్ కథా నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రంలో సాయిపల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అయితే సాయిపల్లవికి నాగశౌర్యకు కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తాయట. లేటుగా రావడం, కొంత పొగరుగా వ్యవహరించడం ఆమెకు అలవాటు. సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ చూసి, జెలసీగా నేను ఫీలై చెప్పడం లేదు. నా కెరీర్‌లో ఎంతోమంది అందగత్తెలను చూశాను. టాలెంటెడ్ యాక్టర్లను చూశాను. వారిని చూసి నేనెప్పుడూ ఈర్ష్య పడలేదు. సాయిపల్లవిని చూసి ఈర్ష్యగా ఫీలవ్వడంకంటే దూకి చచ్చిపోతాను అని గతంలో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు.

తాజాగా దక్షిణాదిలో ఓ టాప్ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ.. కరు చిత్ర షూటింగ్ సమయంలో చిన్న విషయాలకు కూడా సాయిపల్లవి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఆమె ప్రవర్తన నాకు పూర్తిగా నచ్చలేదు. ఫిదా హిట్టయినా ఆమె ఒక్కరి వల్లే కాదు. ఆ విజయం టీమ్ వర్క్ అని చెప్పినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. 

నాగశౌర్య గతంలో చేసిన కామెంట్లపై, తాజాగా వెల్లడించిన అభిప్రాయంపై సాయిపల్లవి పెదవి విప్పడం లేదు. ఎంసీఏ చిత్రం రిలీజ్‌కు ముందుగానీ.. ఆ తర్వాత గానీ మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే మీడియాలో కూడా ఆమె స్పందించకపోవడంపై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రస్తుతం శర్వానంద్‌తో సాయిపల్లవి ఓ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ కోల్‌కతాలో శరవేగంగా పూర్తి చేసుకొంటోంది. వీటితోపాటు మారి2, సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో రూపొందే ప్రాజెక్ట్‌లోను నటిస్తోంది. గతేడాది సాయిపల్లవి నటించిన ఫిదా, ఎంసీఏ చిత్రాలు ఘనవిజయాన్ని సాధించడం గమనార్హం.