ఓ సినిమా సీక్వెల్ తీయటమంటే అంతకు ముందు హిట్టైన చిత్రం విజయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్సపెక్టేషన్స్ ఆ యాంగిల్ లోనే మొదలవుతాయి. ఏ మాత్రం అంచనాలను రీచ్ కాకపోయినా అబ్బే అంటూ పెదవి విరిచేస్తారు. అయితే అదే డైరక్టర్, అదే హీరో అయితే కొంతలో కొంత మెరుగు. అలా కాకుండా ఒరిజనల్ చిత్రం దర్శకుడు వేరే..సీక్వెల్ చేసే డైరక్టర్ వేరే అయితే కాస్త ఇబ్బందే. ఇప్పుడు మన్మధుడు 2 చిత్రానికి అదే ఎదురుకానుంది.

నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా అయిన 'మన్మధుడు' ఆ స్దాయి విజయం కు ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు. కానీ ఇప్పుడు ఇప్పుడు త్రివిక్రమ్ బోర్డ్ లో లేరు. రాహుల్ రవీంద్రన్ ఈ ప్రాజెక్టుని టేకప్ చేసారు. ఇది రాహుల్ రవీంద్రన్ కు పెద్ద టాస్కే. ఈ విషయం గమనించిన నాగార్జున ..రాహుల్ ని రేపు ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక త్రివిక్రమ్ తో పోలిక ఉంటుంది..ఫ్యాన్స్ లో అంచనాలు ఉంటాయి. వాటికి ఏ మాత్రం  తగ్గినా  తర్వాత మనం చేసేదేమి ఉండదు అని క్లారిటీ ఇచ్చారట.  అంతేకాకుండా సినిమాను పూర్తి ఫన్ తో డీల్ చేయమని, కామెడీ ఎపిసోడ్స్ ని హైలెట్ చేయమని సూచన చేసారట. 

నటుడురాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారాడు.ఆ సినిమా యావరేజ్ అనిపించుకున్నా నాగార్జున కు బాగా నచ్చింది. దాంతో నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా అయిన 'మన్మధుడు' కి సీక్వెల్ ఆఫర్ ఇచ్చారు.   ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అధికారికంగా త్వరలో లాంచ్ చేయనున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. 

మార్చ్ 12 న సినిమా అధికారికంగా లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట. సినిమా షూటింగ్ మొత్తం యూరోప్ లో జరగనుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ కూడా అక్కడే జరుగుతుందట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.