నాగార్జున ఈ రోజు తన 61వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఆయన బర్త్ డేకి సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` చిత్ర లుక్‌ని, ఆయన పాత్ర వివరాలను వెల్లడించారు. మరోవైపు హ్యాపీబర్త్ డే కింగ్‌ నాగార్జున యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. మొత్తంగా ఈ రోజు టాలీవుడ్‌లో నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్‌ సందడి నెలకొంది. 

ఇదంతా జరుగుతున్న సమయంలో నాగ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. తన వయసు ఇంకా 31ఏళ్లే అని తెలిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. నిజానికి నాగ్‌ వయసుకి అతీతంగా కనిపిస్తారు. ఎప్పుడూ నిత్య యవ్వనుడిగా ఉంటూ అందంలో తన సొంత తనయులకు పోటీనిస్తున్నాడు. ఈ వయసులో కూడా ఇంత యంగ్‌గా కనిపించడం పట్ల ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాగ్‌ సరదాగా ఈ ట్వీట్‌ చేశారు. 

అందులో తన వయసుని సగం తగ్గించి చెబుతూ, హాయ్‌.. ఇవాళ నా 31వ పుట్టిన రోజు(నవ్వుతూ). నిన్నటి నుంచి ఎంతో మంది ప్రేమ, అభిమానంతో తమ విశెష్‌ని సందేశాలను నాకు పంపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కినేని అభిమానులకు, పరిశ్రమలో నా స్నేహితులకు థ్యాంక్స్. ఈ సందర్భంగా మరో విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అయిదున్నర నెలల తర్వాత మళ్ళీ వర్క్ చేయబోతున్నా. `బిగ్‌బాస్‌ సీజన్‌ 4` షూటింగ్‌కి వెళ్ళబోతున్నా` అని తెలిపారు.

ఇంకా చెబుతూ, గతేడాది బిగ్‌ బాస్‌ సీజన్‌ 3తో మీ ముందుకొచ్చాను. మీ అందరు నా మీద ఎంతో ప్రేమ, అభిమానం చూపించారు. ఆ సీజన్‌ని ఎంతో సక్సెస్‌ చేశారు. అందుకు ధన్యవాదాలు. సీజన్‌ 4ని కూడా మీ ప్రేమాభిమానాలు, బ్లెస్సింగ్స్, పార్టిసిపేషన్‌తో సక్సెస్‌ చేయాలని నా కోరిక. మీ అందరినీ బిగ్‌బాస్‌ 4లో కలుసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను` అని తెలిపారు. అంతేకాదు ఈ సోమవారం నుంచే బిగ్‌బాస్‌ 4 షూటింగ్‌తోపాటు తాను ప్రస్తుతం నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` షూటింగ్‌ కూడా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. దీంతో సీనియర్‌ హీరోల్లో షూటింగ్‌లోకి అడుగుపెడుతున్న తొలి హీరో నాగార్జున కావడం విశేషం.