Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున సంచలనం.. `శివ` అరుదైన మైలురాయి

`శివ` టాలీవుడ్‌లో ఓ సంచలనం. మూస ధోరణి చిత్రాల పంథాని మార్చిన చిత్రం. రామ్‌గోపాల్‌ వర్మ అనే ఓ డేరింగ్‌ పర్సన్‌కి డైరెక్టర్‌గా పురుడు పోసిన చిత్రం. అక్కినేని నాగార్జున ఇమేజ్‌ని మార్చిన చిత్రం. తాజాగా ఇది టాలీవుడ్‌లో ఓ మైలురాయికి చేరుకుంది.

nagarjuna starrer shiva completed 31 years arj
Author
Hyderabad, First Published Oct 5, 2020, 12:45 PM IST

`శివ` టాలీవుడ్‌లో ఓ సంచలనం. మూస ధోరణి చిత్రాల పంథాని మార్చిన చిత్రం. రామ్‌గోపాల్‌ వర్మ అనే ఓ డేరింగ్‌ పర్సన్‌కి డైరెక్టర్‌గా పురుడు పోసిన చిత్రం. అక్కినేని నాగార్జున ఇమేజ్‌ని మార్చిన చిత్రం. తాజాగా ఇది టాలీవుడ్‌లో ఓ మైలురాయికి చేరుకుంది. నేటితో ఇది 31ఏళ్ళు పూర్తి చేసుకుంది. 

ఈ సినిమాతో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించారు. తెలుగు సినిమాలోకి ఓ మగాడు లాంటి డైరెక్టర్‌ వచ్చాడురా అని అంతా చెప్పుకునేలా చేసిందీ చిత్రం. ముఖ్యంగా ఇందులో సైకిల్‌ చైన్‌ని నాగ్‌ తెంచే సీన్‌ అప్పట్లో సంచలనం. కుర్రాళ్ళు ఈ సీన్‌ కోసమే ఎగబడి సినిమా చూడటం విశేషం.  

బెజవాడ రౌడీ రాజకీయాలకు, కాలేజ్‌ల్లో రౌడీల పెత్తనానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ సినిమా 1989 ఆక్టోబర్‌ 5న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా విడుదల తర్వాత ఓ సునామినే సృష్టించిందని చెప్పొచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా సౌండ్‌కు మరింత ప్రాధాన్యతను పెంచిన చిత్రమిది. మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్‌.గోపాల్‌ రెడ్డి  సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ చిత్రంతో నాగార్జున అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. బాలీవుడ్ లోనూ క్రేజ్ ను సంపాదింకున్నారు నాగ్. 

విజయవాడలో చదువుకున్న రోజుల్లో వర్మ తన కాలేజ్‌ జీవితంలో చూసిన, విన్న గొడవల ఆధారంగా 'శివ' చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం యాభై ఐదు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలై 22 సెంటర్స్‌లో వంద రోజులు, ఐదు సెంటర్స్‌లో యాభై రోజులు పూర్తి చేసుకుంది. పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శితమైన ఈ చిత్రానికి బెస్ట్‌ మూవీగా ఫిలింఫేర్‌ అవార్డ్‌తో పాటు బెస్ట్‌ ఫస్ట్‌ ఫిలిం, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ డైలాగ్స్ కేటగిరీల్లో సినిమాకు నంది అవార్డులు కూడా వచ్చాయి. `శివ` సినిమా అనగానే నాగార్జునే కాదు, విలన్‌గా నటించిన రఘువరన్, అమల పాత్రలు గుర్తుకు వస్తాయి.  ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయగా, అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios