ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో బంగార్రాజు రంగంలోకి దిగిపోయాడు. సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోయే స్టార్ హీరో సినిమా ఇదొక్కటే.
కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఆరేళ్ళ క్రితం విడుదలయింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు వస్తోంది. నాగార్జునతో పాటు ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో బంగార్రాజు రంగంలోకి దిగిపోయాడు. సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోయే స్టార్ హీరో సినిమా ఇదొక్కటే. దీనితో బంగార్రాజుకి బాగా కలసి వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన బంగార్రాజు మీడియా సమావేశంలో ప్రశ్నించగా నాగార్జున ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ టీం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మూడేళ్ళ పాటు వాళ్ళు ఎంతో శ్రమించి సినిమా నిర్మించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇక్కడ మాత్రమే విడుదల కావాల్సిన చిత్రం కాదు. అది పాన్ ఇండియా మూవీ. ప్రపంచం మొత్తం విడుదల కావాలి. ప్రపంచం మొత్తం విడుదలై అద్భుతమైన విజయం సాధించాలి. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలి. కానీ ఆ చిత్రం విడుదలకు ఇది సమయం కాదు. సరైన టైంలో ఆ చిత్రం విడుదలై ఘనవిజయం సాధిస్తుంది అని నమ్ముతున్నా.
రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా చిత్రమే. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. పరిస్థితులు అనుకూలించకే ఆ రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి అని నాగార్జున అన్నారు. ఆ రెండు చిత్రాలు వాయిదా పడడం వల్ల బంగార్రాజుకు కలసి వస్తుందా లేదా అనేది చెప్పలేం.. ఎందుకంటే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ కాదు.. ఒమిక్రాన్ అనేది ఒకటి ఉంది. అంతా దాని చేతుల్లోనే ఉంది అని నాగార్జున అన్నారు.
సో నాగార్జున మనసులో కూడా కోవిడ్ టెన్షన్ ఉందని ఇట్టే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీ తెలంగాణాలలో కూడా థియేటర్స్ విషయంలో కోవిడ్ నిబంధనలు అమలులోకి వస్తే బంగార్రాజు పరిస్థితి ఏంటో ఇప్పుడే చెప్పలేం. జనవరి 14న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
