ఎన్నో వివాదాలతో అసలు ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు బిగ్ బాస్ 3పై ఉన్నాయి. కానీ ఆ వివాదాలేవీ బిగ్ బాస్ షోపై ప్రభావం చూపలేదు. బిగ్ బాస్ సీజన్ 3 ఆరంభం అదిరింది. తొలి ఎపిసోడ్ లోనే కింగ్ నాగార్జున మెప్పించాడు. నాగార్జునకు ఉన్న వాక్చాతుర్యత, స్క్రీన్ ప్రజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఫర్ఫెక్ట్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

మాటల్లో తడబాటు లేదు.. హుందా తనానికి లోటు లేదు.. ఇలా తొలి ఎపిసోడ్ ని నాగార్జున డీల్ చేసిన విధానం అదుర్స్ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. షో ఆరంభంలో తనకు ఇష్టం లేకున్నా బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చానో నాగార్జున వివరించాడు. మనసు కోతి లాంటిది. మీ అందరికి బిగ్ బాస్ షో ఎందుకంత ఇష్టమో తెలుసుకోవాలని ఉంది. అందుకే ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా అంటూ నాగ్ ఎంటర్ అయిపోయాడు. 

వేదికపైకి రాగానే తొలి సీజన్ కు హోస్ట్ గా చేసిన నా పెద్ద కొడుకు జూ. ఎన్టీఆర్ కు అభినందనలు అని నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్ 2 ని కూడా విజయవంతగా నడిపిన నా గోల్డ్ నానికి కూడా అభినందనలు అని నాగార్జున వేదికపై తొలి పలుకులు పలికాడు. 

జూ. ఎన్టీఆర్ ని ఉద్దేశించి నాగార్జున చేసిన వ్యాఖ్యలకు కారణం ఉంది. నందమూరి హరికృష్ణని నాగార్జున ఆత్మీయ సోదరుడిగా భావిస్తారు. పలు సంధర్భాల్లో హరికృష్ణ తనకు అన్నయ్య అని నాగార్జున తెలిపారు. అలా హరికృష్ణ కుమారుడైన ఎన్టీఆర్ తనకు కూడా కొడుకే అని ఈ విధంగా నాగార్జున కామెంట్స్ చేసాడు.