ఒకరికి మరొకరు సహాయం చేసుకోవడం మిత్రధర్మం. ఈ ధర్మాన్ని గట్టిగా వాడేస్తున్నారు నాగార్జున, మోహన్ బాబు. మిత్రుడైన చిరంజీవిని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. 


అవసరంలో ఆదుకునేవాడే మిత్రుడు. ఒకరికి మరొకరు సహాయం చేసుకోవడం మిత్రధర్మం. ఈ ధర్మాన్ని గట్టిగా వాడేస్తున్నారు నాగార్జున, మోహన్ బాబు. మిత్రుడైన చిరంజీవిని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. పరిశ్రమలో చిరంజీవికి నాగార్జున అత్యంత సన్నిహితుడు. మిగతా హీరోలతో పోల్చితే చాలా కాలంగా నాగ్, చిరు మధ్య గట్టి స్నేహబంధం ఉంది. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 


కాగా నాగార్జున ఇటీవల నటించిన వైల్డ్ డాగ్ మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవి విరివిగా పాల్గొన్నారు. వైల్డ్ డాగ్ టీజర్స్, ట్రైలర్స్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. వైల్డ్ డాగ్ విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మినిమమ్ వసూళ్లు అయినా రాబట్టకపోతే కష్టం అని భావించిన నాగ్.. ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవిని ఆహ్వానించారు. చిరు మిత్రుడు నాగ్ కోసం ప్రతి పౌరుడు చూడాల్సిన చిత్రంగా వైల్డ్ డాగ్ ని అభివర్ణించాడు. ఎంతో ఉత్కంఠ రేపిన వైల్డ్ డాగ్ మూవీని చివరి వరకు బ్రేక్ తీసుకోకుండా చూశాను అంటూ చిరు ఆకాశానికి ఎత్తాడు. 


చిరు మాట సాయం పూర్తిగా వైల్డ్ డాగ్ ని బ్రతికించలేకపోయినా ఎంతో కొంత మేలు అయితే చేసే ఉంటుంది. అది ఎంత అనేది నాగార్జునకు మాత్రమే తెలుసు. ఒకప్పుడు టామ్ అండ్ జెర్రీలా ఉండే చిరు, మోహన్ బాబు మిత్రులుగా మారారు. తరచుగా కలుస్తున్న వీరు, కలిసి విహారాలు కూడా చేస్తున్నారు. ప్రత్యేక బహుమతులతో తమ స్నేహభావం చాటుకుంటున్నారు. 


చిరు స్నేహాన్ని మోహన్ బాబు కూడా మూవీ ప్రొమోషన్స్ కి వాడడం షురూ చేశాడు. మోహన్ బాబు లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా టీజర్ విడుదల కాగా, దానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ విధంగా సినిమాకు భారీ ప్రచారం దక్కింది. టీజర్ లోనే కాకుండా మూవీలో కూడా చిరంజీవి వాయిస్ ఓవర్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఫార్మ్ కోల్పోయిన నాగ్, మోహన్ బాబు తమ చిత్రాల ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ ఇమేజ్, ఫ్రెండ్ షిప్ వాడేస్తున్నారటన్న మాట.