ఒకప్పుడు గోడమీద పోస్టర్ చూసి సినిమా రిలీజ్ అవుతోందని తెలుసుకునేవాళ్ళు. కానీ సినిమా ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాలకు విభిన్నమైన పద్ధతుల్లో ప్రచారం కల్పించుకుంటున్నారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ తమ చిత్రాలకు ప్రచారం కల్పించుకుంటున్నారు. 

తాజాగా నాగార్జున, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 ప్రచారంలో భాగంగా ఓ ప్రాంక్ వీడియో చేశారు. ఈ వీడియో అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. రాహుల్ కు నాగార్జున ఫోన్ చేసి ఎం చేస్తున్నావని ప్రశ్నిస్తాడు. వెన్నెల కిషోర్ తో డబ్బింగ్ లో ఉన్నాను సర్ అని రాహుల్ బదులిస్తాడు. 

మీరిద్దరూ డబ్బింగ్ చెబుతున్నారా లేక జోకులు వేసుకుంటూ కూర్చున్నారా అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత తన కిష్టమైన పుడ్ కోసం నాగ్ రాహుల్ ని ఓ రెస్టారెంట్ కు పంపుతాడు. అక్కడవేరే వాళ్ళు ఆర్డర్ చేసిన జ్యూస్ ని తాగమని రాహుల్ కు చెబుతాడు. వైటర్ తో గొడవపెట్టుకోమంటాడు.. పరిచయం లేని అమ్మాయిని పొగడమని చెబుతాడు.. ఇలా రాహుల్ తో నాగార్జున వింత వింత పనులు చేయిస్తాడు. రాహుల్ మాట్లాడుతున్న తీరుకు పరిచయం లేని అమ్మాయి ఆశ్చర్యపోతుంది. సర్ ఆ అమ్మాయి కొట్టేలా ఉంది అంటూ రాహుల్ నాగార్జునని బతిమాలుతాడు. 

చివర్లో ఇందంతా ప్రాంక్ అని రివీల్ చేస్తారు. 17 ఏళ్ల క్రితం ఘనవిజయం సాధించిన మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 వస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.