మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ మన ఇష్టం ద్వారా తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం డబ్బులు సంపాదించడం ఎలా అనే టాపిక్ డిస్కస్ చేసిన నాగబాబు తాజా వీడియోలో వ్యాపారం అయినా, సినిమా పరిశ్రమలో అయినా ఎదగడానికి గల కొన్ని సూత్రాలు తెలియజేశారు. చేయబోయే వ్యాపారంపై పూర్తి అవగాహన లేకుండా అడుగుపెట్టకూడదు అన్నారు. 

 బాలీవుడ్ సీనియర్ నటుడు పృథ్విరాజ్ కపూర్ కుమారులలో ఒకరైన రాజ్ కపూర్ ఉత్సాహం చూసి ఆయన్ని డైరెక్టర్ కమ్ హీరోని చేద్దాం అనుకున్నాడట. అలా అని వెంటనే రాజ్ కపూర్ ని హీరోని చేయకుండా పృథ్విరాజ్ కపూర్ తన ప్రొడక్షన్ హౌస్ లో క్లాప్ బాయ్ గా నియమించుకున్నాడు. దానికి కారణం ఫిల్మ్ మేకింగ్ లో ఒడిదుడుకులు, ప్రతి ఒక్కరి ప్రాధాన్యత తెలియజేయాలి అనుకున్నాడు అని చెప్పారు. 

కె బాలచందర్, రామ్ గోపాల్ వర్మ వంటివారు ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేయకుండా గొప్ప డైరెక్టర్స్ అయ్యారు అన్నారు. తరుణ్ భాస్కర్, సుజిత్, మేర్లపాక గాంధీ వంటి వారు షార్ట్ ఫిల్మ్స్ చేసి, పరిశ్రమ ద్రుష్టి తమ వైపు తిప్పుకున్నారని గుర్తు చేశారు. 

ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి గొప్ప వివరణ ఇచ్చారు నాగబాబు. పూరి జగన్నాధ్ మొదటి చిత్రం బద్రి కాగా, ఆ సినిమా అవకాశం ఎలా వచ్చిందో వివరించాడు. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరి దగ్గరా పని చేయలేదట. అప్పట్లో ఉన్న పోటీ రీత్యా పూరికి ఆ అవకాశం దక్కలేదట. ఐతే ఒక ఏక లవ్యుడిలా సినిమా మేకింగ్ నేర్చుకున్నాడట. 

పూరి అప్పట్లో హైదరాబాద్ లో ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడట. అక్కడ ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న తీరు గమనించేవాడట. తాను షూటింగ్ సమయంలో చూసిన సన్నివేశం తెరపై ఎలా వచ్చిందన్న విషయాన్ని గమనించేవాడట. అలా కొన్నాళ్ల తరువాత నాగబాబు కజిన్ ద్వారా పూరి పవన్ కి కథ చెప్పే అవకాశం దక్కించుకున్నాడట. 

అలా పూరి ఎవరి దగ్గరా పని చేయకుండానే  పవన్ తో బద్రి మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడట. టి త్రివిక్రమ్ రావు నిర్మించిన ఆ చిత్రం భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.