రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన `విరాటపర్వం` విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్రంలోని `నగాదారిలో` పాట గ్లింప్స్ ని విడుదల చేశారు.
రానా(Rana), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన `విరాటప్వం`(Virataparvam) చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కాబోతుంది. జులై 1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ప్రీ పోన్ చేసిన విషయం తెలిపిందే. దీంతో ఈ సినిమా ముందుగానే థియేటర్లలో సందడి చేసేందుకు వస్తుంది. ఇందులో ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మాజీ నక్సలైట్ రవన్న జీవితం ఆధారంగా 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఉడుగుల. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్. ఆకాశవాణి విరాటపర్వం వార్తలు పేరుతో ఈసినిమాకి సంబంధించిన అప్‌డేట్లని ఇవ్వబోతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా జూన్ 2న `నగాదారిలో`(Nagaadaarilo) పాటని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.
తాజాగా ఈ పాటకి సంబంధించిన గ్లింప్స్ ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. `నిప్పు ఉంది, నీరు ఉంది నగదారిలో.. చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో` అంటూ సాగే పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హృదయాలను దోచుకుంటుంది. వినసొంపుగా సాగే ఈ పాట వీడియోలో రానా, సాయిపల్లవిల మధ్య ప్రేమ కథని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. నక్సల్ పోరాటాన్ని నిప్పుగా, సాయిపల్లవితో ప్రేమని నీరుగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ పాటకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, వరం ఈ పాటని ఆలపించారు.ఈ పాటని ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు రాశారు. ఈ పూర్తి పాట రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రలో నటిస్తుండగా, ఆయన కవితలు చదివి అతడి ప్రేమ కోసం వెళ్లే యువతి వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.
