యంగ్ హీరో నాగశౌర్య వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన అశ్వధ్ధామ మూవీతో ఆయన ఫార్మ్ లోకి వచ్చారు. ఆ సినిమాకు రమణ తేజ దర్శకత్వం వహించగా, నాగ శౌర్య స్వయంగా నిర్మించారు. ఆ సినిమాకు నాగ శౌర్య స్వయంగా కథను అందించడం మరో విశేషం. కాగా ప్రస్తుతం నాగ శౌర్య సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. 

నాగ శౌర్య 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆయన ప్రొఫెషనల్ ఆర్చర్ రోల్ చేస్తున్నాడు. సిక్స్ ప్యాక్, ముడి వేసుకున్న జుట్టు, జీన్ ధరించి లక్ష్యాన్ని టార్గెట్ చేస్తున్నట్లు ఉన్న ఆ మూవీ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ప్రముఖ నిర్మాతలు నారాయణ్ కే నారంగ్, శరత్ మరార్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. దీనితో మూవీపై భారీ అంచనాలున్నాయి. 

కాగా నాగ శౌర్య నేడు మరో నూతన ప్రాజెక్ట్ ప్రకటించారు. తన సొంత నిర్మాణ  సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 4వ చిత్రంగా దీన్ని ప్రకటించారు. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్ చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన అనీష్ కృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రం రొమాన్స్ అండ్ కామెడీ జోనర్ లో తెరకెక్కనుంది.టైటిల్ ఇంకా నిర్ణయించలేదు.  త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా, మిగతా నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.