దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని.. నటుడు నాగశౌర్యని రొమాన్స్ విషయంలో వరస్ట్ అని తేల్చి చెప్పేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. సమంత ప్రధాన పాత్రలో 'బేబీ' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో నాగశౌర్య కూడా నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాలో 'నాలో మైమరపు' పాటకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి షూటింగ్ సమయంలో తమ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ముందుగా సమంత.. 'రొమాంటిక్ సాంగ్స్ చేయడంలో నాగశౌర్య వరస్ట్' అని చెప్పి నవ్వేసింది.

దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. ''సెట్స్ లో శౌర్య ఉన్నాడంటే నాకు టెన్షన్ మొదలవుతుంది.. హీరోయిన్ ఎక్కడ ఉన్నా ఆమెకి ఇరవై అడుగుల దూరంలో శౌర్య ఉంటాడు'' అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తిని సమంత బాగా హ్యాండిల్ చేసిందని, శౌర్యకి, సమంతకి కుక్కలంటే చాలా ఇష్టమని ఇద్దరూ అదే మాట్లాడుకుంటూ పాటని కంప్లీట్ చేశారని వెల్లడించింది.

స్క్రీన్ పై వీరిద్దరి జంట అంత ఫ్రెష్ గా ఉంటుందని ఊహించలేదని తెలిపింది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇది వరకు విడుదలైన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన మేకింగ్ సాంగ్ లో మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది.