యంగ్ హీరో నాగ శౌర్య సబ్జక్ట్స్ ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయన గత చిత్రం అశ్వద్ధామ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. అశ్వద్ధామ చిత్రానికి నాగ శౌర్య, కథ స్వయంగా అందించారు. కాగా ఆయన లేటెస్ట్ మూవీ లక్ష్య టీజర్ నేడు విడుదల చేశారు. నాగ శౌర్య పుట్టినరోజు పురస్కరించుకొని లక్ష్య టీజర్ విడుదలైంది. 

నిమిషానికి పైగా నిడివి కలిగిన లక్ష్య టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆర్చర్ గా ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదగాలనుకున్న ఓ యువకుడికి ఎదురైన ఇబ్బందులు, లక్ష్యాన్ని చేరుకున్న సన్నివేశాల సమాహారమే లక్ష్య మూవీ అని అర్థం అవుతుంది. రెండు భిన్నమైన గెటప్స్ లో నాగ శౌర్య అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన సిక్స్ ప్యాక్ బాడీ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. 

సచిన్ ఖేడేకర్ మరియు జగపతి బాబు మూవీలో కీలక రోల్స్ చేశారని అర్థం అవుతుంది. కెరీర్ లో ఫెయిల్ అయిన యువకుడి రోల్ లో నాగ శౌర్య ఆవేశం, ఆవేదనతో కూడిన యాక్టింగ్ ఆకట్టుకుంది. లక్ష్య మూవీలో కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా... కాల భైరవ మ్యూజిక్ అందించారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి లక్ష్య చిత్రానికి దర్శకత్వం వహించారు.