నాగచైతన్య `కస్టడీ` ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. నిండా నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే
నాగచైతన్య నటించిన `కస్టడీ` సినిమా ఓటీటీలో రాబోతుంది. నెల రోజులు కూడా నిండకుండానే డిజిటల్‌లో రిలీజ్ చేయబోతున్నారు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించిన `కస్టడీ` సినిమా మే ప్రారంభంలో విడుదలైంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. రిలీజ్‌కి ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదలైన రెండు చోట్ల డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.16కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 8కోట్ల షేర్ సాధించింది.
డిజిటల్ రైట్స్ నుంచి సుమారు 15 నుంచి 20కోట్ల మధ్యలో వచ్చిందని సమాచారం. ఈ లెక్కన ఈ సినిమా సుమారు ఇరవై కోట్ల నష్టాలను చవి చూసింది. శ్రీనివాసా సిల్వర్స్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రిలీజ్‌కి ముందే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ అన్నారు. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ఘోరంగా నష్టాలను చవిచూసింది. కొన్న బయ్యర్లు రోడ్డున పడే పరిస్థితి. దీంతో సెటిల్ చేశారని సమాచారం.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ భారీ అమౌంట్‌కి డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది. తాజాగా డేట్ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్. ఈ నెల 9న శుక్రవారం `కస్టడీ` సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. `కస్టడీ` మూవీ మే 12న విడుదలైంది. అంతే నెలకి మూడు రోజులు ముందుగానే రిలీజ్ కాబోతుండటం విశేషం. థియేటర్లలో వారం రోజులకే క్లోజ్ కావడంతో ఓటీటీలో త్వరగా తీసుకొస్తున్నారు.
`కస్టడీ`లో నాగచైతన్యకి జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, అలాగే స్పెషల్ అప్పీయరెన్స్ లో వంటలక్క, వైభవ్, రాంకీ వంటి వారు మెరిశారు. ఎంత మంది తెరపై కనిపించినా సినిమాని నిలబెట్టలేకపోయారు. నాగచైతన్యకి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాఫ్‌లు పడ్డాయి. అంతకు ముందు `థ్యాంక్యూ` పరాజయాన్ని చవి చూశారు.