పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీకి సంబంధించి సినీ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి నాగబాబు స్పందించారు.
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీకి సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకన్న సంగతి తెలిసిందే. వారిలో ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి నాగబాబు స్పందించారు. ఓ వీడియో విడుదల చేసిన నాగబాబు.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని పోలీసులు చెప్పినట్టుగా తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకూడదనే తాను వీడియో విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అనవసర ప్రచారాలు చేయవద్దని కోరారు.
‘‘ గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటం. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపటం వల్ల పబ్ మీద పోలీసు యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంతా వరకు ఆమె క్లియర్. ఇక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారం వరకు.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్‌కు తావివ్వకూడదని నేను వీడియోను రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్‌గా ఉంది. దయచేసి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్ వ్యాప్తి చేయవద్దని నా రిక్వెస్ట్’’ అని నాగబాబు వీడియోలో పేర్కొన్నారు.
ఇక, రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీకి సంబంధించి సమాచారం రావడంతో.. ఈ రోజు తెల్లవారుజామున పబ్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ డెకాయ్ ఆపరేషన్‌లో నార్త్, సెంట్రల్, వెస్ట్ జోన్ పోలీసులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో ఉన్న దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని పలువురు సెలబ్రిటీలు, బడా బాబుల పిల్లలు ఉన్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ సినీ నటి నిహారిక ఉన్నారు. పలువురు రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, అదుపులోకి తీసుకున్నవారి వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు.. అనంతరం వారిని పంపించివేశారు. నిహారిను కూడా విచారించిన పోలీసులు.. అనంతరం ఆమెను పంపించివేశారు.
