సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో, దాని రిలీజ్ డేట్ కూడా అంతే ముఖ్యం. ఈ విషయం సీనియర్ నిర్మాతలకు, హీరోలకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందే రిలీజ్ డేట్స్  ఫిక్స్ చేసుకుని ప్రకటించేస్తూంటారు. ముఖ్యంగా తమ సినిమాకు వేరే ఏ పెద్ద సినిమా క్లాష్ రాకూడదని చూసుకుంటారు. ఇప్పుడు నాగార్జున కూడా అదే చేయబోతున్నారు.

ఆయన తాజా చిత్రం మన్మధుడు 2 చిత్రానికి రిలీజ్ డేట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే మన్మధుడు 2 ని నాగ్ పుట్టిన రోజైన ఆగస్ట్ 29 న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కానీ ఆగస్టు 15న ప్రభాస్ సాహో చిత్రం రిలీజ్ కు వస్తూండటంతో రిస్క్ ఎందుకని చాలా మంది వారిస్తున్నారట.

కానీ సాహోకు మన్మధుడు 2 మధ్య పది రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి అంత ఆలోచించాల్సిన పనిలేదని నాగ్ చెప్తున్నారట.  కానీ డిస్ట్రిబ్యూటర్స్ , సన్నిహితులు మాత్రం ఈ విషయమై నాగ్ ని మరోసారి ఆలోచించి ప్రకటన చేయమని సలహా ఇస్తున్నారట. ఇక మన్మధుడు 2 చిత్రం ప్రస్తుతం పోర్చుగల్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని నాగార్జున భావిన్నట్లు సమాచారం. 

‘మన్మథుడు 2’లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ‘RX 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.