ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా నాగ అశ్విన్ గుర్తింపు పొందాడు. ఇక గత ఏడాది విడుదలైన మహానటి చిత్రంతో నాగ అశ్విన్ తన సత్తా మొత్తం బయట పెట్టాడు. మహానటి చిత్రం అద్భుత విజయం సాధించడమే కాదు.. జాతీయ అవార్డులు సైతం కొల్లగొట్టి ప్రశంసలు దక్కించుకుంది. లెజెండ్రీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి ప్రతి ఒక్కరిని అలరించింది. 

ఇదిలా ఉండగా నాగ అశ్విన్ తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనకు నచ్చిన సినిమా కూడా కొన్నిసార్లు పరాజయం చెందుతుంది. అలాంటి జాబితాలో చాలానే చిత్రాలు ఉంటాయి. నాగ అశ్విన్ కు కూడా కొన్ని సినిమాల విషయంలో అలాంటి అభిప్రాయం ఉందట. 

ఈ తెలుగు సినిమాలు ఇంకా బాగా ఆడి ఉండాల్సింది. ఈ సినిమాలు వర్కౌట్ అయి ఉంటే తెలుగు సినిమా గతే మారిపోయి ఉండేదని నా ఫీలింగ్. ఖలేజా, లీడర్, పంజా, ఆరెంజ్, అందాల రాక్షసి, డియర్ కామ్రేడ్ చిత్రాలు ఆ కోవలోకి వస్తాయి. 

ముఖ్యంగా ఖలేజా సినిమా.. ఆ చిత్రంలో త్రివిక్రమ్ రచనా ప్రతిభ ఎంత అద్భుతమో గుర్తు చేసుకోండి. చివరగా నా ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఆపద్భాందవుడు కూడా ఆ జాబితాలో ఉంది అని నాగ అశ్విన్ తెలిపాడు. 

ఖలేజా, పంజా, ఆరెంజ్ చిత్రాలు విడుదలైనప్పుడు విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఆ చిత్రాలలో మంచి దర్శకత్వ ప్రతిభ ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.