గౌతమి స్థానంలో నదియా.. కమల్‌తో జోడికి సర్వం సిద్ధం?
ఈ ఏడాది మలయాళంలో `దృశ్యం2` రూపొంది ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో తమిళంలోనూ `దృశ్యం2` రీమేక్ కాబోతుంది. కమల్ ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.
`దృశ్యం` సినిమా ఒక సంచలనం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మొదట మలయాళంలో రూపొంది భారీ విజయాన్నిసాధించింది. దీంతో ఇది వరుసగా ఇతర భాషల్లో రీమేక్ అయ్యింది. మలయాళం నుంచి తెలుగు, తమిళం, కన్నడ,హిందీలో కూడా రీమేక్ అయి అన్ని భాషల్లోనూ సక్సెస్ సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేష్, మీనా కాంబినేషన్‌లో చేయగా, మాతృకలో మోహన్‌లాల్, మీనా చేశారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి కాంబినేషన్‌లో రూపొందించారు.
ఈ ఏడాది మలయాళంలో `దృశ్యం2` రూపొంది ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో వెంటనే తెలుగులో వెంకీ రీమేక్ చేశారు. మాతృక దర్శకుడు తెలుగులోనూ దర్శకత్వం వహించారు. ఇది విడుదలకు రెడీగా ఉంది. హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే తమిళంలోనూ `దృశ్యం2` రీమేక్ కాబోతుంది. కమల్ ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. గౌతమి తన నుంచి విడిపోయిన నేపథ్యంలో ఇప్పుడామె సీక్వెల్‌లో చేసేందుకు సుముఖత చూపించడం లేదట. దీంతో మీనాతోనే చేయాలని కమల్ భావించారు. కానీ తాజా సమాచారం మేరకు నదియాని తీసుకోవాలనుకుంటున్నారట.
తెలుగు మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్‌గా, `దృశ్యం 2`లో మాజీ పోలీస్ అధికారిగా నదియా నటించారు. ఈ నేపథ్యంలో ఆమె కమల్ సరసన చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. మరి ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎవరిని తీసుకుంటారనేది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. కమల్ ప్రస్తుతం `విక్రమ్` చిత్రంలో నటిస్తున్నారు. `ఇండియన్2` చేయాల్సి ఉంది. `దృశ్యం2`కి తక్కువ సమయమే పట్టే అవకాశం ఉండటంతో ఫాస్ట్ గా ఫినీష్ చేయాలని భావిస్తున్నారట.