జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందారు. జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో ఓట్లు సాధించినా సీట్ల పరంగా ప్రభావం చూపలేకపోయింది. దీనితో జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి.. పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. చాలా రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మైత్రి మూవీస్ కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. అజ్ఞాతవాసి చిత్రం ముందు నుంచే ఈ వార్తలు వస్తున్నాయి. ఓ భారీ చిత్రం చేసేందుకు మైత్రి నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అజ్ఞాతవాసి తర్వాత మరో సినిమా చేయలేదు. ఎన్నికల్లో పవన్ ఓటమి చెందడంతో తిరిగి సినిమాల్లో నటించాలనే డిమాండ్ బలపడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ ఇచ్చిన విషయాన్ని మైత్రి మూవీస్ నిర్మాత నవీన్ ప్రస్తావించారు. 

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. గతంలో అనుకున్నాం కుదర్లేదు. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే మంచి కమర్షియల్ చిత్రానికి ప్లాన్ చేస్తామని నవీన్ అన్నారు. 

అదే విధంగా పరుచూరి గోపాల కృష్ణ కూడా పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ సినిమాలకు దూరం కావడం సరైనది కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏడాది ఒక్కటి అయినా  ప్రజలని ప్రభావితం చేసే చిత్రం చేయాలని సూచించారు. సినిమా వల్ల ప్రజలకు మరింత చేరువకావచ్చు అని అన్నారు. ఎన్టీఆర్ కేవలం మూడు నెలల్లోనే ప్రజలకు దగ్గరైన విషయాన్ని పరుచూరి ప్రస్తావించారు. సినీ ప్రముఖుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.