మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన `స్పైడర్‌` చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా ఈ చిత్రం రూపొందింది. జనరల్‌గా సామాజిక సందేశం, వాణిజ్య అంశాలు మేళవించి సినిమాలు రూపొందించి హిట్‌ కొట్టడం మురుగదాస్‌ స్టయిల్‌. కానీ, `స్పైడర్‌` విషయంలో అది వర్కౌట్‌ కాలేదు. తనపై మహేష్‌ పెట్టుకున్న ఆశలు, అభిమానులు పెట్టుకున్న అంచనాలను తలక్రిందులు చేసిందీ సినిమా. 

అయితే మురుగదాస్‌ విషయంలో మహేష్‌ డిజప్పాయింట్‌ కావడంతో ఆయనకు మరో మంచి హిట్‌ అందించి మహేష్‌, ఆయన అభిమానులు ఖుషీ అయ్యేలా చేస్తానని తాజాగా మురుగదాస్‌ తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం మహేష్‌ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. త్వరలోనే వెళ్ళి సూపర్‌స్టార్‌ని కలుస్తానని ఓ ఇంగ్లీష్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురుగదాస్‌ తెలిపారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. 

ఈ ఏడాది సంక్రాంతికి రజనీకాంత్‌తో `దర్బార్‌` చిత్రాన్ని రూపొందించారు మురుగదాస్‌. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీంతో ఇప్పుడు మహేష్‌ తో సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడట మురుగదాస్‌. ప్రస్తుతం మహేష్‌బాబు.. పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.