సోషల్‌ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగిన సోషల్‌ మీడియోలో ఆ సంఘటన ఇట్టె వైరల్‌ అవుతుంది. అలాగే జరగని విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. కొంతమంది తన ఆనందం కోసం రకరకాల రూమర్స్ పుట్టిస్తున్నారు. దాంతో సోషల్‌ మీడియాల్లో వచ్చే వార్తల్లో ఏది నిజం, అబద్ధమని చెప్పడం చాలా కష్టం. ఇందుకు ఈ తాజా సంఘటనే ఉదహరణ.
 
గత కొద్ది రోజులు  బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా కరోనా బారిన పడ్డారని, ఆరోగ్యం విషమించడంతో తనువు చాలించారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో  ఆయన చనిపోయాడని భావించి చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ అభిమానులు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇది కాస్తా ఆయన  దృష్టికి వెళ్లడంతో  ఒక్కసారిగా షాకయ్యారు. తాను చనిపోలేదని, క్షేమంగా ఉన్నానని స్పష్టం చేసారు. తన మరణంపై వస్తు‍న్న పుకార్లపై స్వయంగా  ముఖేష్ ఖన్నానే స్పందించారు

కోవిడ్‌ కారణంగా తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు కరోనా సోకలేదని, ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించాడు. ఈమేరకు సోషల్‌ మీడియాలో వీడియో రిలీజ్‌ చేసి క్లారిటీ ఇచ్చాడు..

"మీ ఆశీర్వాదాల వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను కోవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరానని వస్తున్న వార్తలు అవాస్తవం. నాకసలు కరోనా రాలేదు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో, ఏ ఉద్దేశ్యంతో వాటిని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వారిని ఏం చేస్తే ఇలాంటివి మానేస్తారు? సోషల్‌ మీడియా వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. కానీ ఇలా ఫేక్‌ న్యూస్‌లతో ప్రజల ఎమోషన్లతో ఆడుకోవడం దారుణం, దీనికి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలి. ఈ వార్తలతో నేను విసిగి వేసారిపోయాను" అని ఆవేదన వ్యక్తం చేశాడు

ముఖేష్‌ ఖన్నా కెరీర్ విషయానికి వస్తే.. అతడు సినిమాలతో పాటు టీవీ షోలలోనూ కనిపించాడు. శక్తిమాన్‌ సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. సౌధాగర్‌, యల్గార్‌, మేన్‌ కిలాడీ తు అనారీ వంటి పలు చిత్రాల్లోనూ నటనతో ఆకట్టుకున్నాడు.