తొలి ప్రేమ' లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మిస్టర్ మజ్ను. ఈ  చిత్రానికి మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా స్పందన కనిపించడం లేదనేది ట్రేడ్ వర్గాల రిపోర్టు. గురువారం జనవరి 25న మిస్టర్ మజ్ను ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడ్డాయి. అయితే గతంలో వచ్చిన అఖిల్ సినిమాలతో పోల్చితే వసూళ్లు బాగా తక్కువగా కనిపించాయి.

ఈ నేపధ్యంలో  సినిమా హిట్ అంటూ , తమ నమ్మకం నిజమైందంటూ మీడియా సమావేశం నిర్వహించారు దర్శక,నిర్మాతలు. దాంతో ఓ ప్రక్క టాక్ తేడాగా ఉన్నా...ఇలా హిట్ అంటూ ప్రెస్ మీట్ పెట్టడంతో  సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. సోషల్ మీడియాలో అయితే నిర్మాత..నా నమ్మకం నిజమైంది అనటాన్ని చూపెడుతూ... అంటే రిజల్ట్ ని ముందే ఊహించిన నిర్మాత అంటూ జోక్స్ వేస్తున్నారు. 

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత.  శుక్రవారం చిత్రం విడుదలైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. 

అఖిల్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక ప్రేమకథే కాదు, మంచి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకులు నవ్వుకుంటారనే నమ్మకంతోనే చేశాం. అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు ఈ సినిమాతో తన స్థాయిని పెంచుకొన్నాడు. తమన్‌ సంగీతం, జార్జ్‌ కెమెరా పనితనం సినిమా   విజయంలో కీలక పాత్ర పోషించాయి. 

మా కుటుంబానికి... మజ్ను అనే పేరుకు చాలా అనుబంధం ఉంది. అదే పేరుతో నేను సినిమా చేసి ఆ పేరుకున్న గౌరవాన్ని నిలబెట్టాననే ప్రశంసలు వస్తున్నాయి. అన్నిచోట్లా ప్రేక్షకులు సినిమాని బాగా ఆస్వాదిస్తున్నారు. చాలామంది భావోద్వేగాలు బాగా పండించావని మెచ్చుకున్నార’’అని చెప్పారు

నిర్మాత మాట్లాడుతూ ‘‘అక్కినేని నాగేశ్వరరావుకి ‘లైలా మజ్ను’, నాగార్జునకి ‘మజ్ను’ ఎలా మైలురాయిగా నిలిచాయో, అఖిల్‌కి ‘మిస్టర్‌ మజ్ను’ ఆ స్థాయిలో విజయాన్ని అందిస్తుంది’’ అన్నారు.