ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నరేష్ ప్యానెల్, శివాజీరాజా ప్యానెల్ పోటీ పడగా.. నరేష్ ప్యానెల్ ఎక్కువ ఓట్లు సాధించి విజయం అందుకుంది. ఈ క్రమంలో నరేష్ 'మా' ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయాల్సివుంది.

కానీ అది మాత్రం జరగడం లేదు. దానికి కారణం శివాజీరాజా అని తెలుస్తోంది. సాధారణంగా ఓ కమిటీకి కాలపరిమితి దగ్గరకు వచ్చిన తరువాతే ఎన్నికలు జరుపుతారు. అప్పటికి ఉన్న కమిటీనే ఎన్నికైతే ఎలాంటి సమస్య ఉండదు.

కానీ కొత్త పార్టీ గెలిస్తే.. ఇంకా కాలపరిమితి ఉన్నా కూడా సాధారణంగా ముందు కమిటీ పక్కకు తప్పుకొని కొత్త కమిటీకి అవకాశం ఇస్తుంది. కానీ మా అసోసియేషన్ కి సంబంధించి అలా జరగడం లేదని తెలుస్తోంది. 

తమ కమిటీ టైం ఉన్నంతవరకు తామే రూల్ చేస్తామని, ఆ తరువాత కొత్త కమిటీ రావాలని శివాజీరాజా మెలిక పెట్టాడట. అలా కాకుండా ప్రమాణ స్వీకారం చేస్తే గనుక కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారట. దీంతో ఈ విషయంపై మీడియాతో మాట్లాడాలని చూస్తున్నారు నరేష్. మరేం జరుగుతుందో చూడాలి!