మలయాళ చిత్ర పరిశ్రమ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. సినీ కార్మికులను ఆదుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 145 మంది తారలు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌, దుల్కర్‌ సల్మాన్‌, నివిన్‌ పౌలీ ఇలా స్టార్స్ అంతా కలిసి సినిమా చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించగా, రాజీవ్‌ కుమార్‌ ఆశీర్వాద్‌ సినిమా పతాకంపై నిర్మించనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించనున్నారు. 2020 కరోనా కల్లోలం ప్రధానంగా ఈ సిసాగుతుందని తెలుస్తుంది. 

ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. మలయాళ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(అమ్మా) కొత్త భవనం నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్‌లాల్‌, మమ్ముట్టి వెల్లడించారు. దాదాపు 10కోట్లతో కొచ్చిలో `అమ్మ` కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి తారలు, ఇతర ప్రముఖులు విరాళాలు అందించారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టి పాల్గొని మాట్లాడారు. సినీ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అందుకు సినిమా చేయబోతున్నట్టు చెప్పారు. 

కరోనా వల్ల షూటింగ్‌ లు లేక వేలాది మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు, అలాగే కళాకారులు సైతం ఇబ్బంది పడ్డారు. వారిని ఆదుకునేందుకు సినిమా తీస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా తీయగా, వచ్చిన కలెక్షన్లని `అమ్మా`కి, సినీ కార్మికులకు సహాయంగా అందిస్తామని `అమ్మా` అధ్యక్షుడు మోహన్‌లాల్‌ చెప్పారు.