చాలా రోజుల గ్యాప్‌ తర్వాత విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో `సన్నాఫ్‌ ఇండియా` చిత్రం రూపొందుతుంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న ఈ సినిమాని ప్రకటించారు. డైమండ్‌ రత్నబాబు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. 

తాజాగా శుక్రవారం ఈ సినిమా ప్రారంభమైంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. మోహన్‌బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. `కంగ్రాట్స్ డాడీ. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నా. బెస్ట్ ఆఫ్‌ లక్‌. నాకు తెలుసు మీ అత్యద్భుతమైన నటనతో అందరిని అలరిస్తారు` అని ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మోహన్‌బాబుకి మంచు విష్ణు భార్య విరానిక స్టయిలీష్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాతో ఆమె స్టయిలిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతుండటం విశేషం. ఈ సినిమాకి ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.