కలెక్షన్‌ కింగ్‌, డైలాగ్‌ కింగ్ మోహన్‌బాబు నటుడిగా అరుదైన ఘనతని సాధించారు. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ని పూర్తి చేసుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం 1974లో విడుదలైంది. దీంతో అప్పటి నుంచి విలన్‌గా, హీరోగా, మళ్ళీ విలన్‌గా, ఆ తర్వాత హీరోగా, ఇప్పుడు మెయిన్‌ లీడ్‌గా, ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ రాణిస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరో ఇలా 560కి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి విలక్షణ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. 

నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తనదైన శైలిలో రాణిస్తున్నారు మోహన్‌బాబు. ముఖ్యంగా సినీ రంగంలో ఆయన డైలాగ్స్ లకు సెపరేట్‌ క్రేజ్‌ ఉంది. గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగులను అవలోలగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన సినిమాలకు డైలాగులే హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఇక కలెక్షన్‌ కింగ్‌గానూ ఆయనకు పేరుంది. ఆయన నటించిన చిత్రాలు అప్పట్లో భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. చిరంజీవి వంటి స్టార్‌ హీరోలను తట్టుకుని నిలబడ్డారు. ఆయనతో పోటీపడ్డారు. 

నిర్మాతగా తన కూతురు మంచు లక్ష్మీ పేరుతో `లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌` బ్యానర్‌ని స్థాపించి యాభైకి పైగా సినిమాలు చేసి నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు. ఇక విద్యా వేత్తగా శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థను స్థాపించి నాణ్యమైన విద్యని అందిస్తున్నారు. అంతేకాదు పేదలకు ఉచితంగా విద్యని అందించి తన సామాజిక బాధ్యతని చాటుకుంటున్నారు. 

ఆయన సినీ రంగానికి ఇంకా తన సేవలను అందిస్తున్నారు. ఇటీవల ఆయన సూర్య హీరోగా `ఆకాశం నీ హద్దురా` చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇది మంచి విజయం అందుకున్నారు. మరోవైపు చాలా గ్యాప్‌తో ఆయన మెయిన్‌ లీడ్‌గా ఓ సినిమా రూపొందుతుంది. `సన్నాఫ్‌ ఇండియ` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమా రంగానికి అందిస్తున్న సేవలకుగానూ 2007లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

మోహన్‌బాబు నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తనయుడు హీరో, నిర్మాత మంచు విష్ణు తన తండ్రి 45 ఏళ్ల సినీ ప్రయాణం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ ఓ వీడియో విడుదల చేశారు. అంతేకాదు చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ లెజెండ్రీ యాక్టర్‌కి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
మోహన్‌బాబుకి ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌, కూతురు మంచు లక్ష్మీ ఉన్నారు. వీరు ముగ్గురు నటులుగా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.