కలెక్షన్‌ కింగ్‌ డా.మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `సన్నాఫ్‌ ఇండియా`. చాలా రోజుల తర్వాత మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రమిది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని గతేడాది ప్రకటించిన విషయంతెలిసిందే. 

తాజాగా శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో మెడలో రుద్రక్షమాల ధరించి, మాసిన గెడ్డంతో కోపంగా ఉన్న మోహన్‌బాబు లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్‌ని మోహన్‌బాబు ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ `దేశభక్తి అతని రక్తంలోనే ఉంది` అని పేర్కొన్నారు. ఈ లుక్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు భార్య విరానిక మంచు డిజైనర్‌గా పనిచేస్తున్నారు.ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మంచు మనోజ్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మోహన్‌బాబు ఇటీవల తమిళ సినిమా `సూరరై పోట్రు`(తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రంలో గెస్ట్ రోల్‌ పోషించిన విషయం తెలిసిందే.