సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆయన రక్తపోటు కారణంగా అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. రజనీ లేటెస్ట్ మూవీ అన్నాత్తే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా... దాదాపు ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కి కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. అయితే రజినీకాంత్ కోవిడ్ నెగెటివ్ అని రావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక రజనీకాంత్ ఆరోగ్యంపై అనేకమంది చిత్ర ప్రముఖులు స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ లేఖ విడుదల చేశారు. అలాగే రజినీ కాంత్ మిత్రుడు మోహన్ బాబు సైతం రజనీ కాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రజనీ కాంత్ మానసికంగా, శారీకంగా ధృడమైన వ్యక్తి, ఈ పరిస్థితి నుండి కోలుకొని ఆయన బయటికి వస్తారని మోహన్ బాబు అన్నారు. అలాగే రజినీ కాంత్ భార్య లత, ఐశ్వర్యలకు మోహన్ బాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. 

రజినీ కాంత్ ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదన్న ఆసుపత్రి వర్గాలు ఆయనకు విశ్రాంతి కావాలి అన్నారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కానున్నారని సమాచారం అందుతుంది. ఇక తన పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసిన రజనీ కాంత్ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.