కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటులలో ఒకరు. మోహన్ బాబు దాదాపు 500పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్ గా తిరుగులేని నటన ప్రదర్శించారు. మోహన్ బాబు నేటితో 44 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులంతా మోహన్ బాబు నటనని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు విష్ణు ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. నటుడిగా 44 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం ఆయనకు ఓ అనుభవం. కానీ మాకు స్ఫూర్తి నాన్న. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా 44 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. సినిమా తల్లి ద్వారా ఎదిగి ఎంతో మందికి విద్య, ఉపాధి కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు అని మనోజ్ ట్వీట్ చేశాడు. 

ఇక మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా ట్వీట్ చేశాడు. నా తండ్రి.. నా హీరో నటుడిగా 44 ఏళ్ళు పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు అని విష్ణు ట్వీట్ చేశాడు. 

మోహన్ బాబు ప్రస్తుతం సూర్య నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా అనే చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మోహన్ బాబు నటిస్తున్న తమిళ చిత్రం ఇదే. 1974లో కన్నవారి కలలు, అల్లూరి సీతారామరాజు చిత్రాలతో మోహన్ బాబు సినీ ప్రస్థానం మొదలయింది. మొదట విలన్ పాత్రల్లో మెప్పించిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా మారారు. 

మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, యమజాతకుడు, శ్రీరాములయ్య లాంటి అద్భుత చిత్రాల్లో నటించారు.