Asianet News TeluguAsianet News Telugu

"మిస్టర్" మూవీ రివ్యూ

  • చిత్రం : మిస్టర్
  • నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పాటిల్, నాజర్, తనికెళ్ల భరణి, పృథ్వీ
  • సంగీతం : మిక్కీ జె మేయర్
  • దర్శకత్వం : శ్రీను వైట్ల
  • నిర్మాత : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
  • ఏసియానెట్ రేటింగ్- 2.5
mister movie review

కథ :
చై అలియాస్ పిచ్చయ్య నాయుడు స్పెయిన్ లో అతని అమ్మా నాన్నలతో కలిసి ఉంటుంటాడు. అక్కడికి వచ్చిన మీరాను చూసి ప్రేమలో పడతాడు. కానీ మీరా అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకుని బాధ పడతాడు. అయితే మీరా తిరిగి ఇండియాకి వెళ్లాక తన ప్రియుడుతో తన పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పెయిన్ లో ఉన్న స్నేహితుడు చైకి ఫోన్ చేస్తుంది. దీంతో ప్రేమలో ఓడిపోతే ఉండే బాధ తనకు తెలుసు కాబట్టి తను ప్రేమించిన మీరా కోసం చై ఇండియాకి వచ్చి మీరా ప్రేమను గెలిపించాలని ప్రయత్నిస్తుంటాడు. అలా మీరా కోసం ఇండియా వచ్చిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) ప్రవేశిస్తుంది. అసలు మీరా ప్రేమకథలో సమస్య ఏంటి..? చై జీవితంలోకి వచ్చిన చంద్రముఖి ఎవరు..?  ఇండియాలో ఉండే తన తాతకు చై ఎందుకు దూరమయ్యాడు..? రాహుల్ వడయార్ ఆట ఎలా కట్టించాడు..? చివరకు చై.. మీరా, చంద్రముఖిలలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? అన్నదే మిగతా కథ.

 

నటీనటులు :
తొలి సినిమా నుంచే నటుడిగా మంచి మార్కులు సాధిస్తూ వస్తున్న వరుణ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అమాకత్వం, ప్రేమ, బాధ, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హెబ్బా పటేల్ కూడా అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ప్రతినాయక పాత్రలో నికితిన్ ధీర్ డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూనే క్రూయల్ విలన్ గా మెప్పించాడు. ఇతర పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, నాజర్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, చంద్రమోహన్, హరీష్ ఉత్తమన్, రాజేష్, 30 ఇయర్స్ పృధ్వీ ఇలా తెర నిండా కనిపించిన నటులు పరవాలేదనిపించారు.

సాంకేతిక నిపుణులు :
లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. విదేశాల్లో కామెడీ ఎపిసోడ్స్, పేరడీ సీన్స్, సినిమా వాళ్ల మీద పంచ్ డైలాగ్స్, పదుల సంఖ్యలో విలన్స్ ఇలా శ్రీను గత సినిమాల్లో కనిపించిన మాసాలా ఎలిమెంట్స్ అన్నీ మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుల ఊపిరి పేరడీ నవ్విస్తుంది. బాహుబలి సినిమా ప్రభావం కూడా ఈ సినిమాపై బాగానే కనిపించింది.
 

ఫస్ట్ హాఫ్ లో అసలు కథలోకి వెళ్లకుండా కామెడీ, రొమాంటిక్ సీన్స్ తో కథ లాగించేసిన దర్శకుడు సెకండాఫ్ ను హడావిడిగా నడిపించాడు. వరుసగా తెరమీదకు వచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తాయి. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు కొంత పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కెవి గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయ్యింది. స్పెయిన్ లోకెషన్స్ ను మరింత అందంగా చూపించిన గుహన్, చేజ్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ల నటన, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

లెక్కలేనన్ని మలుపులు, పాటలు, క్లైమాక్స్

చివరగా... మిస్టర్ శ్రీను వైట్ల రొటీన్ సినిమా

Follow Us:
Download App:
  • android
  • ios