ఉమెన్స్ డే సందర్భంగా మంత్రి రోజా సెల్వమణి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మంత్రి ఆర్కే రోజాకు డాక్టర్స్ అసలు మీకు పిల్లలు పుట్టరని చెప్పారట. మీకు ఫైబ్రాయిడ్ సమస్య ఉంది. సంతానం కలగడం కష్టం అని తేల్చేశారట. 2002లో రోజాకు వివాహం కాగా ఏడాదికి గర్భం దాల్చారట. 2003లో పాపకు జన్మనిచ్చారట. ఆ విషయం తన డాక్టర్ కి చెప్పగా ఆమె ఇది అద్భుతం అన్నారట. మీ ప్రార్ధన దేవుడు ఆలకించాడని రోజాను అభినందించారట. ఆశలు వదులున్న సమయంలో కడుపున పడిన కూతురు అంటే రోజాకు ప్రాణం అట. దర్శకుడు ఆర్ కె సెల్వమణిని రోజా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అమ్మాయి, అబ్బాయి సంతానం. కూతురు పేరు అన్షు మాలిక కాగా, కొడుకు పేరు కృష్ణ కౌశిక్.
డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి.తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి రోజా వందకు పైగా చిత్రాలు చేశారు. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ రోల్స్ చేశారు. రాజకీయాల్లో బిజీ అయిన రోజా పరిశ్రమకు దూరంమయ్యారు. 2015 తర్వాత రోజా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. సినిమాలు వదిలేసినా బుల్లితెరపై రోజా ఏళ్ల తరబడి అలరించారు. 2013లో మొదలైన జబర్దస్త్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరించారు.
2022లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా జబర్దస్త్ వదిలేశారు. ఆమె పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. ఇక రాజకీయాల్లో ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. తెలుగుదేశం పార్టీలో రోజా రాజకీయ ప్రస్థానం మొదలైంది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ఆయన మరణం అనంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వరుసగా రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యారు.
