తెలంగాణ కార్మిక శాఖ మంత్రి  మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ సినిమాలో తనను నటించమని దర్శకుడు హరీష్ శంకర్ అడిగారని చెప్పారు.

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి  మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ సినిమాలో తనను నటించమని దర్శకుడు హరీష్ శంకర్ అడిగారని.. కానీ అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆ చిత్ర హీరో సుమంత్ర ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. సుమంత్‌ ప్రభాస్‌ చూడటానికి ప్రభాస్‌ కంటే స్మార్ట్‌గా ఉన్నాడని కామెంట్ చేశారు. మేకప్‌ లేకుండానే స్మార్ట్‌గా ఉన్నాడని చెప్పారు. తెలంగాణ మోడల్ అని.. తెలంగాణ బిడ్డ రేపు దుమ్ము లేపుతాడని అన్నారు. సుమంత్ ప్రభాస్ ఫస్ట్ సినిమా.. ఒక చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. 

మందు తాగితే, ధూమపానం, అమ్మాయిల వెంట పడడం, పబ్‌లకు తిరగడం, గంజాయి తీసుకోవడం.. లాంటివి చేస్తే ఎవరూ ఫేమస్‌ కారని అన్నారు. కష్టపడి పనిచేస్తేనే ఫేమస్ అవుతారని అన్నారు. తాను పాలు అమ్మిన, పూలమ్మిన, కాలేజీలు పెట్టా, వాటి ద్వారి టాప్‌ డాక్టర్లను, సైంటిస్టులను, ఇంజనీర్‌లను తయారు చేశానని చెప్పారు. అదీ ఫేమస్‌ కావడం అంటే అని అన్నారు. యువత కష్టపడాలని సూచించారు. ఒకప్పటితో పోల్చితే నేటితరం యువతకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గాలి తిరుగుడు తిరగ కుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లాలని.. ఫేమస్‌ కావాలని సూచించారు. 

Also Read: హీరో ప్రభాస్‌పై మంత్రి మల్లారెడ్డి సెటైర్లు.. సినిమా ఈవెంట్లో రచ్చ

భారతదేశంలో ఫేమస్ మినిస్టర్ కేటీఆర్ అని అన్నారు. తాను ఈ మధ్య ట్రెండింగ్‌లో ఉన్నానని తెలిపారు. తాను తుమ్మితే కూడా తుపాన్ అయింతుందని అన్నారు. దాని వెనక తన కష్టం ఉందని చెప్పారు. సింపుల్ లివింగ్.. లో ప్రొఫైల్.. హై థింకింగ్ అనేది మల్లారెడ్డి మోడల్ అని తెలిపారు. 

ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో సినిమా తీస్తున్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మొన్న తన ఇంటికి వచ్చాడని.. ఆ సినిమాలో విలన్‌గా చేయమని గంటన్నర బతిమిలాడాడని తెలిపారు. అయితే తాను చేయనని చెప్పానని చెప్పారు. ఈ సినిమా హీరోతో తాను ఒక్క సినిమా తీస్తానని  చెప్పారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాలు తీస్తానని తెలిపారు. అది కూడా తెలంగాణ మోడల్‌లో తీస్తానని చెప్పారు. తన జీవితంలో తాను డబ్బులు వెకన పోలేదని.. డబ్బులు మన వెనకపడలాంటే దానికి తగ్గట్టుగా పనిచేయాలని అన్నారు.