ఆర్ఆర్ఆర్ చిత్రంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దర్శకుడు రాజమౌళి. కలలో కూడా ఊహించుకోలేని ఆస్కార్ అవార్డుని ఆర్ఆర్ఆర్ చిత్రంతో జక్కన్న తెచ్చిపెట్టారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దర్శకుడు రాజమౌళి. కలలో కూడా ఊహించుకోలేని ఆస్కార్ అవార్డుని ఆర్ఆర్ఆర్ చిత్రంతో జక్కన్న తెచ్చిపెట్టారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ దిగ్గజాల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి దర్శకులు జక్కన్న పనితీరుని అభినందించారు. 

ఇక ఇండియాలో అయితే భాషా, ప్రాంత బేధాలు లేకుండా ఆర్ఆర్ఆర్ చిత్రం అలరించింది. రాజకీయ నాయకులు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు రాజమౌళిని సత్కరించారు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, మంత్రి హరీష్ రావు బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

హరీష్ రావు మాట్లాడుతూ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగు జాతి ఖ్యాతిని రాజమౌళి ప్రపంచ వ్యాప్తం చేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన చిత్రాల్లో దేశభక్తి, సామాజిక స్పృహ కనిపిస్తాయి అని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు సాధించడంతో హరీష్ రావు జక్కన్నని సన్మానించారు. భవిష్యత్తులో రాజమౌళి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరారు. 

రాజమౌళి మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ హరీష్ రావు గారి పనితీరు చూసినప్పటి నుంచి నేను ఆయనకి అభిమానిగా మారిపోయా అని రాజమౌళి అన్నారు. అంతకు ముందు మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్.. ఎంఎన్ జె ఆసుపత్రిలో రెండేళ్ల పాటు పేషంట్స్ కేరింగ్, సెక్యూరిటీ లాంటి బాధ్యతలని తామే తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.