భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు వెలిగారు మెహర్ రమేష్. కన్నడలో ఆయన డైరక్ట్ చేసిన ఆంధ్రా వాలా రీమేక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే  తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. మెహర్ చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను రప్పించలేక.. నిర్మాతలను  నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పరార్ అనే పరిస్దితి. 

అందుకే వెంకీ తో చేసిన షాడో సినిమా వచ్చి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. ఈ టైమ్ లోనే ఆయన మహేష్ బాబుకు దగ్గరయ్యారు. ఆ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యారు.  ఈ క్రమంలో గ‌త కొన్నేళ్ల‌గా మ‌హేష్ వ్యాపారాలు ఆయ‌నే చూసుకుంటున్నారు. ఇప్పుడు మ‌హేష్ సినిమాతో , ఆయన అండతో తానే సొంతంగా పంపిణీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు   స‌రిలేరు నీకెవ్వ‌రు  చిత్రం గుంటూరు హ‌క్కులు ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. ప‌ద్మాక‌ర్ సినిమాస్ సంస్థ పేరుపై మెహ‌ర్ రైట్స్ తీసుకున్న‌ట్లు వినిపిస్తోంది.  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా  అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు భారీ అంచనాల న‌డుమ తెర‌కెక్కుతోంది. ఇందులో మ‌హేష్ ఆర్మీ అధికారి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్స్ సినిమా పై అంచ‌నాలు అమాంతం పెంచేస్తున్నాయి.