నటీనటులు: ఆకాష్ పూరి, నేహాశెట్టి. మురళీశర్మ తదితరులు 
సంగీతం: సందీప్‌ చౌతా
సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ
ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పని చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా..? అని స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూసేవారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ రేసులో దూసుకుపోయిన ఈ దర్శకుడు ప్రస్తుతం ఒక హిట్ కోసం పరితపిస్తున్నాడు. తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా 'మెహబూబా' అంటూ తన సొంత ప్రొడక్షన్ లో సినిమాను రూపొందించాడు. మరి ఈ సినిమా పూరి జగన్నాథ్ కు ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథలోకి వెళ్తే.. 
నలభై ఏళ్ల క్రితం పాకిస్థాన్-ఇండియా సరిహద్దుల్లో ఓ యుద్ధం జరుగుతుంది. పాకిస్థాన్ సైనిక బృందం హిందుస్థాన్ కు చెందిన కొందరు ప్రజలను తమ ఆధీనంలోఉంచుకుంటుంది. కబీర్(ఆకాష్ పూరి)అనే పాకిస్థాన్ సైనికుడు మదిర(నేహాశెట్టి) అనే హిందుస్థాన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఇద్దరూ కూడా సరిహద్దుల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మదిరను ప్రాణంగా ప్రేమించిన కబీర్ ఆమె కోసం సరిహద్దులు దాటి ఆమెను చేరుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా మరణిస్తారు. కొన్నేళ్ళ తరువాత కబీర్.. రోషన్ గా ఇండియాలో పుడతాడు. మదిర.. అఫ్రీన్ గా పాకిస్థాన్ లో పుడుతుంది. తమ ప్రేమ కోసం మళ్ళీ పుట్టిన ఈ జంటకు అదే సరిహద్దుల సమస్య వస్తే దాన్ని ఎలా ఎదిరించి నిలిచారనేదే కథ. 

నటీనటుల పనితీరు: 
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఆకాష్ పూరి హీరోగా ఇదివరకే 'ఆంధ్రాపోరి' సినిమాలో నటించాడు. మరోసారి అతడికి రీఎంట్రీ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పూర్తి మేకోవర్ తో కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఆకట్టుకున్నాయి. కానీ హీరోగా ఆకాష్ ను తెరపై చూడడం అంత సంతృప్తిగా అనిపించలేదు. నటన పరంగా తన పాత్రలో ఇంటెన్సిటీ కనబరిచాడు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాల్లో బాగా నటించాడు. హీరోయిన్ గా నేహాశెట్టి అందంగానే ఉంది. కానీ తెరపై ఈ జంట మధ్య కెమిస్ట్రీ పెద్దగా పండలేదు. ఆకాష్ ఏజ్ గ్రూప్ అమ్మాయిని తీసుకొని ఉంటే బాగుండేది. లుక్స్ పరంగా నేహాశెట్టి బాగానే ఆకట్టుకుంది. సినిమా మొత్తం కూడా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుండడంతో మిగిలిన పాత్రలు ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. విలన్ గా కనిపించిన విషు రెడ్డి అనే కుర్రాడు ఉన్నంతలో బాగానే నటించాడు. కానీ అతడికి సరైన క్యారెక్టరైజేషన్ రాసుకోలేకపోయారు. పతాక సన్నివేశాల్లో కనిపించే లేడీ మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ బాగుంది. మురళీ శర్మ, షాయాజీ షిండే తమ నటనతో మెప్పించారు. 

సాంకేతికవర్గం పనితీరు: 
ఈ సినిమా మెయిన్ అసెట్ సినిమాటోగ్రఫీ. విష్ణుశర్మ తన కెమెరా యాంగిల్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. హీరో ఎలివేషన్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. సందీప్ చౌతా మ్యూజిక్ ఎంతమాత్రం ఆకట్టుకోదు సరికదా మరింత విసిగిస్తుంది. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. నేపధ్య సంగీతం కొంతవరకు ఆకట్టుకుంటుంది. 'మెహబూబా' అంటూ సాగే బీజియం మాత్రం గుర్తుండిపోతుంది. పాటల్లో చూపించిన లొకేషన్స్ అందంగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగానే ఉంది. పతాక సన్నివేశాలలో ఫ్లాష్ బ్యాక్ ను ప్రస్తుతానికి లింక్ చేస్తూ నడిపించిన ప్యారలల్ ఎపిసోడ్ బాగుంది. పూరి జగన్నాథ్ సినిమాలలో కథలు చెప్పుకునే స్థాయిలో లేనప్పటికీ హైలైట్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ బాగుంటాయి. వాటికోసమే థియేటర్ కు వెళ్ళే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. కానీ ఈ సినిమాలో అలా చెప్పుకునే సన్నివేశాలు లేకపోవడం 
బాధాకరం.రెగ్యులర్ ప్యాటర్న్ లో సినిమాలు చేస్తుంటే వర్కవుట్ కాకపోవడంతో 'మెహబూబా'తో కొత్తగా ట్రై చేశాడు. నిజానికి  పూరి ఫ్లాప్ సినిమాలలో కూడా తనదైన మార్క్ సీన్స్ ఉంటాయి. మెహబూబాలో అటువంటి మార్క్ సీన్స్ ఎక్కడా కనిపించవు. దర్శకుడిగా ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని అందుకుంటానని ఆశించిన పూరికి నిరాశే మిగిలింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

గుర్తుండిపోయే డైలాగులు: 
''జీవితంలో ఒక్కసారైనా చచ్చిపోయే పరిస్థితి వస్తేనే బ్రతికినట్టు లెక్క..''
''యుద్ధం వచ్చినా చస్తాం.. రాకపోయినా చస్తాం..''
ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ ను పొగిడే కొందరిని ఉద్దేశిస్తూ.. ''కన్నతండ్రిని ఇంట్లో 
పెట్టుకొని పక్కింటోడిని నాన్న అంటావ్ ఏంటి'' అంటూ హీరో పలికే మాట హైలైట్ గా నిలిచింది. 
''తను కనిపించినప్పుడు నా గుండె ఆగిపోయింది ఇప్పుడు వెళ్లిపోతుంటే నా గుండె పగిలిపోతుంది''

విశ్లేషణ
పూర్వజన్మల కాన్సెప్ట్ తో రూపొందిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. దీంతో అదే కాన్సెప్ట్ తో కొడుకుతో చిత్రీకరించాడు పూరి. నిజానికి పూరి రాసుకున్న కథ, కథనాలలో కొత్తదనం నిండివుంది. కానీ వాటిని ఆడియన్స్ కు నచ్చే విధంగా తెరకెక్కించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ పరిచయం సన్నివేశాలను సాగాదీస్తూ టైంపాస్ చేశాడు. ఊహించని విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. నలభై ఏళ్ల పాటు ఒక అమ్మాయి శవం హిమాలయాల్లో ఉంది అని చూపించడం నమ్మలేని విషయం. సైంటిఫిక్ గా ఇది సాధ్యమేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. బహుశా మైనస్ డిగ్రీ సెల్సియస్ లో సాధ్యమవుతుందేమో! ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. ప్రేమకథలో డెప్త్ లేనప్పటికీ సరిహద్దుల బ్యాక్ డ్రాప్ కావడంతో బాగానే అనిపిస్తుంది. సినిమాలో చెప్పుకోవడానికి ఏమైనా ఉంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రమే. దాన్ని కూడా సాగదీసి పూరి ఆడియన్స్ ను విసిగించాడు.ఓవరాల్ గా చూసుకుంటే పూరి వీరాభిమానులకు కూడా ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. 

రేటింగ్: 1.5/5