సంధ్య థియేటర్ లో చిరంజీవి కూతుళ్ల సందడి.. ఆడియెన్స్ తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ను చూసిన మెగా డాటర్స్!
మెగా ఫ్యాన్స్ కు పండగ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలో గ్రాండ్ గా విడులైంది. కాగా, మెగాస్టార్ కూతుళ్లు తొలిరోజే ఆడియెన్స్ తో కలిసి సినిమాను చూశారు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఈరోజు (జనవరి 13న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే యూఎస్ఏలోని ప్రీమియర్, స్పెషల్ షోలు పడగా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మాస్ ఆడియెన్స్ ను చిరు ఫిదా చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. మెగా అభిమానులు సినిమాను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసకుంటున్నారు. డప్పులు, డాన్సులు, బాణాసంచాలతో హంగామా చేస్తున్నారు. చిరు, రవితేజ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల భారీ కటౌట్స్ కు పూలమాలలు, పాలాభిషేకం చేస్తూ థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.
ఇక, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈ ఉదయం చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు కూడా తొలిరోజే సినిమాను ఆడియెన్స్ తో కలిసి చూడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరితో పాటు డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్ కూడా ప్రేక్షకులతో సినిమాను వీక్షించారు. ఇందుకు ఫ్యాన్స్, ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన టాక్ ప్రకారం.. చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టినట్టు తెలుస్తోంది. చిరు అభిమాని అయిన బాబీ మెగాస్టార్ ను చక్కగా ప్రజెంట్ చేశారని అంటున్నారు. మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి చిరు, రవితేజల మెగా మాస్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారని అర్థంఅవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి - శ్రుతి హాసన్ జంటగా నటించారు. రవితేజ కీలక పాత్ర పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.