Chiranjeevi : చిరంజీవికి గవర్నర్ తమిళిసై సత్కారం.. మెగాస్టార్ స్పెషల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeeviని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్ లో సత్కరించారు. చిరుతో పాటు ఆయన సతీమణి కూడా గౌరవం అందుకుంది.

దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ Padma Vibhushan మెగాస్టార్ చిరంజీవి Chiranjeeviని వరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఈ అత్యున్నత అవార్డును ప్రదానం చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ సభ్యులు చిరును సత్కరించారు. గ్రాండ్ పార్టీ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. పలు వేదికలపై చిరుకు ప్రశంసలు అందుతూనే ఉన్నాయి.
ఇక అటు రాజకీయ నాయకులు కూడా చిరంజీవిని అభినందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన్ని సత్కరించారు. ఇక తాజాగా ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ.. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గవర్నర్ చిరంజీవి గారి సామాజిక సేవలని ప్రస్తావిస్తూ, పద్మవిభూషణ్ పురస్కారం పొందినందుకు అభినందించారు. శాలువాతో సత్కరించారు. అనంతరం భేటీ అయ్యారు. సినీ, రాజకీయ విషయాలపై చర్చించారు.
ఇదిలా ఉంటే.. చిరంజీవి కూడా గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాజ్‌భవన్‌లో నాకు ఆతిథ్యమిచ్చినందుకు, పద్మవిభూషణ్ సందర్భంగా మీరు శుభాకాంక్షలు తెలిపినందనకు చాలా సంతోషంగా ఉంది. అనంతరం నిర్వహించిన సమావేశంలో సుసంపన్నమైన సంభాషణ జరిగినందుకు సంతోషిస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు. పలు ఫొటోలను పంచుకున్నారు.
నెక్ట్స్ చిరు సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ Vishwambharaలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

