ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన పాటల్లో 'ఓ చెలియా నా ప్రియసఖియా' పాట ఎంత ఫేమస్ అనే సంగతి చెప్పనక్కర్లేదు. ఈ పాటతోనే తాజాగా బేబీ అనే మహిళ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. రంగంపేట మండలం వడిశలేరుకి చెందిన గాయని పసల బేబీకి సంగీతానికి సంబంధించి ఎలాంటి అవగాహన లేదు.

అయినప్పటికీ ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంది. రెహ్మాన్ సైతం ఆమె వాయిస్ ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో బేబీ పాడిన పాట మరింత వైరల్ అయింది.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పిలుపు మేరకు హైదరాబాద్ కి వెళ్లిన బేబీకి అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి నుండి ఆహ్వానం లభించింది. శుక్రవారం నాడు బేబీకి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారట. శనివారం ఉదయం తమ ఇంటికి రావాలని ఆహ్వానించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

ఈ విషయాన్ని ఆమె మీడియాతో పంచుకుంది. శనివారం నాడు చిరంజీవిని కలవబోతున్నట్లు వెల్లడించింది. అలానే మిర్రర్ కార్పోరేట్ కంపనీ యాజమాన్యం తనని సత్కరించినట్లు, తమకి ఇండస్ట్రీలో పరిచయమున్న బాలకృష్ణ, రామ్ చరణ్ లకు ఫోన్ చేసి తన గురించి వివరించి పాటలు పాడే అవకాశాలు కల్పించాలని కోరినట్లు బేబీ వెల్లడించింది.