మెగా ఇమేజ్  తో ఇండస్ట్రీకి వచ్చినా  ఆతర్వాత తన నటన ప్రతిభతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్ తో ఆకట్టుకున్న సాయి, తరువాత ఫ్లాప్ లు పలకరించటంలో ఢీలా పడిపోయాడు. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం , ప్రస్తుతం రచయిత, దర్శకుడు బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ , స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటిలిజెంట్ చిత్రాలు డిజాస్టర్ అవటంతో  ధరమ్ తేజ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. 

వినాయక్ లాంటి మాస్ స్పెషలిస్ట్ తో సినిమా చేసినా కలిసి రాకపోవటంతో మాస్ హీరోగా నుంచి బయిటకు వచ్చి చిత్రలహరి చిత్రం చేసారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. దాంతో ఆచి , తూచి అడుగులు వేస్తున్నాడు.  ఈ నేపధ్యంలో మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాన్ని ఓకే చేశాడు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ లాంటి ఫ్లాప్‌ సినిమాతో వెనకబడిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలె   షూటింగ్‌ను మొదలుపెట్టింది. 

ఇక ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ఓకే చేసినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ ఒక  యంగ్ డైరక్టర్ తో కలిసి ఒక థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా సాయి ధరమ్ తేజ్ కమర్షియల్ సినిమాలలో తప్ప థ్రిల్లర్ సినిమాలో కనిపించకపోవటంతో కొత్త జానర్ ట్రై చేసినట్లు ఉంటుందని ఓకే చేసినట్లు సమాచారం. అలాగే  ఈ సినిమాలో తేజు డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇప్పటికే తమ  మెగా కుటుంబంలో  చిరంజీవి, రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసి హిట్స్ కొట్టి ఉన్నారు. దాంతో  సాయి కి కూడా డ్యూయిల్ రోల్ కాన్సెప్ట్  హిట్ ఇస్తుందేమో చూడాలి.