హీరోగా మూడు నుండి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వరుణ్ తేజ్ ఇప్పుడు ఆ నెంబర్ ని పెంచుకోవడానికి పెద్ద ప్లానే వేశాడు. నిర్మాతగా సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల 'ఎఫ్ 2' సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రంతో బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు.

కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' లైన్ మాదిరి ఈ సినిమా కూడా ఉంటుందని టాక్. ఈ సినిమాలో సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కి బాక్సింగ్ నేర్పించే కోచ్ పాత్ర పోషిస్తున్నారు. 

ఈ సినిమాను అల్లు అర్జున్ అన్నయ్య బాబీ, వరుణ్ తేజ్ లు కలిసి నిర్మించబోతున్నారు. బాబీ పూర్తి నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుండగా.. వరుణ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోవడం ద్వారా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటాయి.

సినిమాపై కాస్త హైప్ ఉన్నా.. బిజినెస్ బాగా చేసుకోవచ్చు. ఎలా లేదన్నా.. పది నుండి పదమూడు కోట్ల వరకు మిగులుతుంది. ఈ ఆలోచనతోనే వరుణ్ నిర్మాతగా మారడానికి  సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రాబోతుంది.