శ్రీదేవి శోభన్ బాబు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా ఇంట్లో హీరోలు కూడా నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

మెగా బ్రదర్స్ లో నాగబాబు మాత్రమే కెరీర్లో ఎదగలేదు. చిరంజీవి తమ్ముడి హోదాలో నాగబాబు హీరో కావాలనుకున్నారు.ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. దీంతో నిర్మాతగా మారారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో చిరంజీవి చేసిన సినిమాలన్నీ ఫ్లాప్. ఆ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్ లను కూడా వదల్లేదు. చరణ్ హీరోగా నాగబాబు నిర్మించిన ఆరెంజ్ డిజాస్టర్. ఆ మూవీ తెచ్చిన నష్టాలకు నాగబాబు జీవితం తలకిందులైంది. 

కొంచెం పుంజుకున్నాక అల్లు అర్జున్ 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీలో నిర్మాణ భాగస్వామిగా చేరారు. అల్లు అర్జున్ కెరీర్లో అట్టర్ ప్లాప్ గా ఆ మూవీ నిలిచింది. ఆ సినిమా దెబ్బకు అల్లు అర్జున్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. సెంటిమెంట్స్ వినడానికి మూఢనమ్మకాల్లా ఉంటాయి కానీ... ప్రతిసారి జరుగుతుంటే నమ్మాలనిపిస్తుంది. మెగా హీరోలకు నాగబాబు నుండి మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. చిరంజీవి మూవీలో నాగబాబు ఉన్నాడంటే దాదాపు ప్లాప్. మృగరాజు, అంజితో పాటు పలు చిత్రాల్లో ఈ సెంటిమెంట్ నిజమైంది. 

కారణం ఏదైనా కానీ నాగబాబుకు మెగా హీరోలు ఆఫర్స్ ఇవ్వడం లేదట ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా ఒప్పుకున్నారు. నిజంగా మెగా హీరోల సినిమాల్లో నాగబాబు చాలా అరుదుగా కనిపిస్తారు. అసలు ఇతర హీరోలు ఆయనకు వేషాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబంలో ఉన్న ఏడెనిమిది మంది హీరోలు ప్రతి మూవీలో ఒక వేషం ఇస్తే చాలు. 

శ్రీదేవి శోభన్ బాబు మూవీని చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. దీంతో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ చిత్రంలో నటించిన నాగబాబు మాట్లాడుతూ... మా ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ ఎవరూ ఆఫర్స్ ఇవ్వరు. మా హనీ (సుస్మిత) మాత్రం ఈ చిత్రంతో పాటు మరో వెబ్ సిరీస్లో నాకు అవకాశాలు ఇచ్చింది. తాను అడిగితే ఒక స్టార్ హీరోలు సినిమా చేస్తారు. కానీ స్వశక్తితో నిర్మాతగా ఎదగాలి అనుకుంటుంది... అని చెప్పారు. 

మా ఇంట్లో హీరోలు నాకు వేషాలు ఇవ్వడం లేదని నాగబాబు క్యాజువల్ గా అన్నాడా? లేక తనలోని అసహనం ఈ విధంగా బయటపెట్టాడా? అనేది తెలియడం లేదు. నాగబాబు కామెంట్స్ టాలీవుడ్ లో చర్చకు దారితీశాయి.